నేడు 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 50 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించనుంది.. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పారిశ్రామిక పార్కులను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ పద్ధతిలో జరుగనున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడు నుంచి ముఖ్యమంత్రి ఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండో దశలో భాగంగా 329 ఎకరాల విస్తీర్ణంలో రూ.134 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు. వీటితో పాటు 587 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు, 3 ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, సత్యసాయి, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అన్నమయ్య, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ పారిశ్రామిక పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 17 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టనున్నారు. 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల పెట్టుబడులతో ఈ పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి పూర్తయ్యే సరికి సుమారు 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదఈర్లపాడులో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.7 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” లక్ష్యంతో చేపట్టబడింది..
నా తల్లి, తమ్ముడు దెయ్యాలు.. అందుకే చంపేశా.. నిందితుడి షాకింగ్ వీడియో..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.. రెండు హత్యల అనంతరం నిందితుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.. తల్లిని, తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన గునుపూడి శ్రీనివాస్ పోలీసులతో మాట్లాడిన వీడియో అది.. తల్లి గునుపూడి మహాలక్ష్మి , తమ్ముడు గునుపూడి రవితేజలను తానే హత్య చేశానని, చనిపోయిన తర్వాత కూడా దెయ్యాలుగా మారి నన్ను వేధిస్తారంటూ చెప్పుకొచ్చాడు నిందితుడు శ్రీనివాస్.. ఎవరు ఏం మాట్లాడుకున్నా ముందే మా అమ్మకు, తమ్ముడికి తెలిసిపోతుంది.. వాళ్లిద్దరూ మనుషులు కాదు.. దెయ్యాలు.. అందుకే వాళ్లని హత్య చేశా అంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు నిందితుడు శ్రీనివాస్.. వాళ్లు దెయ్యాలు.. 18 సంవత్సరాల నుంచి నన్ను పిక్కు తింటున్నారు.. అందుకే చంపేశా.. అంతేకాదు. చంపేసిన బతుకుతారేమో అని భయంగా ఉంది.. అంటూ వీడియోలో నిందితుడు గునుపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అతడి మానసిక పరిస్థితికి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి.. కాగా, భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ సోమవారం రోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఐడీ కార్డులు వేసుకోని ఏజెంట్లు.. ఎన్నికల అధికారి కర్ణన్ సీరియస్..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఈరోజు ఎర్రగడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న క్రమంలో, పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న ఏజెంట్లకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులను ధరించాలని, నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఇక, పోలింగ్ కేంద్రంలో తనిఖీ తర్వాత ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏదైనా చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినా, వాటిని వెంటనే పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇక, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ భద్రతను పటిష్టం చేసినట్లు వెల్లడించారు. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గతంలో కంటే 40 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఉత్సాహంగా ఓటేసి.. కొత్త రికార్డ్‌ను సృష్టించండి.. బీహారీయులకు మోడీ పిలుపు
బీహార్‌లో ప్రస్తుతం రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. సరికొత్త రికార్డ్‌ను సృష్టించాలని విన్నవించారు. అలాగే మొదటి సారి ఓటు వేస్తున్న యువత.. ఓటు వేసి ఇతరులను కూడా ఓటు వేసేలా ప్రేరేపించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. మలి విడతలో ‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. సీమాంచల్ అనగానే ఆర్జేడీకి కంచుకోటలాంటిది. ఇక్కడ ఆర్జేడీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 36 స్థానాలకే పరిమితం అయింది. సీమాంచల్‌లో ఎక్కువుగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
2 రోజుల పర్యటన కోసం భూటాన్ వెళ్లిన మోడీ
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు వెళ్లారు. నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లోని థింపులో పర్యటించనున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇక ఈ పేలుడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాజా వివరాలు అడిగి తెలుసుకుని భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు.
బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
బిగ్ బాస్ మలయాళ సీజన్ -7 విన్నర్ గా టైటిల్‌ను ప్రముఖ టెలివిజన్ నటి అనుమోల్ సొంతం చేసుకుంది. ఈ షోకు హోస్ట్ గా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. అయితే.. గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ను ప్రకటించారు మోహన్ లాల్. అనుమోల్ 42.5 లక్షల నగదు బహుమతి, ఒక సరికొత్త SUV, ప్రతిష్టాత్మక బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. అయితే ఇక్కడ కామనర్ అనీష్ మాత్రం రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. షానవాస్ , నెవిన్, అక్బర్ వరుసగా మూడవ, నాల్గవ, ఐదవ స్థానాల్లో నిలిచారు. ఈ విజయంతో అనుమోల్ బిగ్ బాస్ మలయాళ చరిత్రలో రెండవ మహిళా విజేతగా నిలిచింది. ఈ షో విజేతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అనుమోల్ కన్నీటి పర్యంతమయ్యారు. దేవునికి, తన కుటుంబానికి, మద్ధతు తెలిపిన ఆడియన్స్ అందరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు, తాను లాలెట్టన్‌ను కూడా కలవలేకపోయానని.. ఇప్పుడు తాను గర్వంగా ఆయన దగ్గర నిలబడి కౌగిలించుకోగలిగానన్నారు అనుమోల్. ప్రారంభంలో ఈ సీజన్‌కు ప్రైజ్ మనీని రూ. 50 లక్షలుగా ప్రకటించారు. కానీ దానిలో కొంత భాగాన్ని తరువాత బిగ్ బ్యాంక్ టాస్క్ విజేతలకు పంపిణీ చేశారు. దీనితో తుది విజేత బహుమతి రూ. 42.5 లక్షలకు చేరుకుంది.
‘శివ’ చూడగానే నాన్న ఏమన్నారు.. నాగార్జున సమాధానమేంటంటే?
కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శివ సినిమా నాగార్జునకు మాస్ ఇమేజ్ తేవడమే కాక.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ధోరణిని మార్చడమే కాకుండా.. టెక్నికల్‌గానూ ట్రెండ్ సెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా.. నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆర్జీవీ, నాగార్జున మాట్లాడారు. 36 ఏళ్ల క్రితం శివ సినిమా చూసిన నాగేశ్వర రావు గారు ఏమన్నారు? అని ఓ రిపోర్టర్ అడగగా.. నాగార్జున బదులిచ్చారు. ‘నాన్న సినిమా చూసిన రెండు రోజుల తర్వాత నాతో మాట్లాడారు. ఇప్పటికే సినిమాకు మంచి టాక్ వచ్చింది. బాగున్నా అయినా కూడా సినిమాలో కామెడీ లేదు, అదీ లేదు-ఇది లేదు, ఆడవాళ్లకు నచ్చదు.. అంటూ రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి. పంజాగుట్టలో నాన్న, నేను కారులో వెళ్తున్నాం. అప్పుడు శివ సినిమా గురించి మాట్లాడారు. సినిమా చాల పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగా చేశావ్ అన్నారు. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకే తెలియదన్నారు. చాలా సంతోషించా’ అని నాగార్జున చెప్పారు.