వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబును ఉరితీయాలి..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఉరితీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలోనే కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని విమర్శించారు.. చంద్రబాబు పాలనలో ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని. కర్నాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కు నీటి కేటాయింపుకు 2011లోనే కోర్టు స్టే ఇచ్చిందని.. 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్, రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు. అయితే, అప్పర్ భద్ర ప్రాజెక్టుపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉందని గుర్తుచేశారు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి.. అప్పర్ భద్రపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందన్న ఆయన.. ప్రాజెక్టు ఆపేందుకు సుప్రీంకో లో వైఎస్ జగన్ సర్కారు బలమైన వాదనలు వినిపిస్తోందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబును ఉరితీయాలంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..
సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..
కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు. దీంతో పాటు 500 మందికి దళితబంధు ఇవ్వాలని, మహబూబ్ సాగర్ అభివృద్ధకి, సంగారెడ్డి చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సదాశివపేట, కొండాపూర్ లో 5 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు వినతులతో కూడిన లేఖను సమర్పించారు. వినతి పత్రాలపై అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇస్తే ప్రగతిభవన్ కు వస్తానని, నియోజకవర్గ సమస్యలపై కలుస్తా అని అన్నారు. ఈ కలయికపై కొంతమంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని కలిస్తే తప్పులేదు కానీ.. నేను సీఎంని కలిస్తే తప్పా..? అంటూ ప్రశ్నించారు. ప్రధానిని డైరెక్ట్ గా కలిసే వారు డైరెక్టుగా, చాటుగా కలిసేవారు చాటుగా కలుస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న రెండు రోజులకే కోర్టు ముద్రవేశారని.. కొత్తగా వచ్చే బదనాం ఏముందని జగ్గారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ కు తప్పిన భారీ ప్రమాదం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో తన కారుకు ప్రమాదం జరిగింది. ధూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై రాజా సింగ్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనం చాలా పాతది కావడంతో, దాన్ని మార్చాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తన భద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా అనేకసార్లు వాహనం రోడ్డుపై మొరాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిలిచిపోవడంతో వేరే వాహనాల్లో రాజా సింగ్ వెళ్లేవారు.
ఆర్టీసీ కండక్టర్ మృతి కేసులో ట్విస్ట్.. అసలు కారణం ఇదేనా..?
వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్(38 ) నిన్న రాత్రి తాండూర్ నుంచి బాషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామానికి వెళ్లే బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే కన్నుమూశారు.. గుండెపోటు రావడంతో బస్సులోనే స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ని.. గమనించిన ప్రయాణికులు, బస్సు డ్రైవర్ అదే ఆర్టీసీ బస్సులో అతని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే, కండక్టర్‌ని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడు అని నిర్ధారించారు.. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు ఆస్పత్రికి చేరుకొని కండక్టర్ మృతికి డీఎం ఒత్తిడే కారణం అంటూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో డిపో మేనేజర్ సమత అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో మృతుని స్వగృహానికి తరలించారు.. అయితే, పని ఒత్తిడి వల్లే తోటి కార్మికుడు మృతి చెందాడని ఆర్టీసీ సిబ్బంది గుసగుసలాడుకున్నారు.. ఈ విషయం మీడియా ముందుకు వచ్చి చెబితే మళ్ళీ డీఎం తమను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోయారు.. డిపో మేనేజర్ కొత్తగా వచ్చినప్పటి నుంచి తమపై అదనంగా పనిబారం మోపుతున్నారని.. మృతి చెందిన కండక్టర్ చిన్న వయసు కావడం.. అతని ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని తోటి కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డీఎంను వివరణ కోరెందుకు ప్రయత్నించగా తాను బిజీగా ఉన్నానంటూ మాట మార్చేసే ప్రయత్నం చేశారు. అయితే. విధి నిర్వహణలు గుండెపోటుతో సంతోష్ కుమార్ మృతిచెందడానికి ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు తోటి కార్మికులు.
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 77/1
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అదరగొడుతోంది. ముందుగా ఆస్ట్రేలియాను తక్కువ రన్స్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టును టీమిండియా స్పిన్నర్లు ముప్పతిప్పలు పెట్టారు. గాయం కారణంగా కొద్దినెలలుగా ఆటకు దూరమైన రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో రాణించడంతో ఆసీస్ 177 రన్స్‌కే ఆలౌటైంది. లబుషేన్ (49) కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. స్మిత్ (37), అలెక్స్ కారే (36), హ్యాండ్స్‌కాంబ్ (31) కాసేపు పోరాడారు. అశ్విన్ 3, షమీ, సిరాజ్ చెరో వికెట్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా అదరగొట్టింది. నాగ్‌పూర్ పిచ్‌పై టీమిండియా స్పిన్నర్లు రాణించడంతో భారత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని విశ్లేషించారు. కానీ దానికి భిన్నంగా కెప్టెన్ రోహిత్ మొదటి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్ ఎవ్వరైనా వదలకుండా టెస్టుల్లో టీ20 మ్యాచ్ ఆడేశాడు. ఫోర్లు, సిక్స్‌లతోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇతడికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే రాహుల్ (20) ఔట్ కావడంతో రవి అశ్విన్ నైట్ వాచ్‌మన్‌గా మైదానంలోకి వచ్చాడు. కాగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 77 రన్స్ చేసింది. రోహిత్ (56 నాటౌట్), అశ్విన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 100 పరుగుల ఆధిక్యంలో ఉంది.
జడేజా పాంచ్ పటాకా..వాట్ ఏ కమ్‌బ్యాక్ అంటున్న ఫ్యాన్స్
రవీంద్ర జడేజా.. టీమిండియాకు లభించిన ఓ ఆణిముత్యం. తన ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాల్ని అందించాడు జడ్డూ. కానీ గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఇతడు రీఎంట్రీలోనే అదరగొట్టాడు. గతేడాది ఆగస్టు తర్వాత జడేజాకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. కమ్‌బ్యాక్ మ్యాచ్‌లోనే 5 వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను కాదని కెప్టెన్ రోహిత్ ముందుగా జడేజా చేతికే బంతినిచ్చాడు. అయితే లంచ్‌కు ముందు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయాడు. వరుసగా మూడు వికెట్లతో ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. క్రమంగా క్రీజులో పాతుకుపోవాలని చూసిన స్మిత్, లబుషేన్ భాగస్వామ్యాన్ని విడదీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. మొదట ప్రమాదకరంగా మారుతున్న లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాతి బంతికే మ్యాట్ రెన్‌షాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. లెంత్ బాల్‌ను ఆడలేకపోయిన రెన్‌షా తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక కాసేపటికే డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను కూడా జడేజా క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. జడేజా వేసిన బంతిని ముందుకెళ్లి డిఫెండ్ చేయబోగా.. అది కాస్తా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. అవాక్కవడం స్మిత్ వంతైంది. దీంతో 37 రన్స్ చేసిన స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు. జడేజా దెబ్బకు 2 వికెట్లకు 84 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా 109 పరుగులకు 5 వికెట్లతో కష్టాల్లో పడింది. ఇక చివర్లో హ్యాండ్స్‌కాంబ్, మర్ఫీలను ఔట్ చేసి టెస్టుల్లో 11వసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో జడేజా పెర్ఫార్మెన్స్ చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ కమ్‌బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో జడ్డూని కొనియాడుతున్నారు.
బిగ్ బాస్ కు రష్మీ.. కానీ..?
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు నెలలు ఒకే ఇంట్లో 16 మంది కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ప్రేమలు, తప్పొప్పులు చెప్పడానికి అక్కినేని నాగార్జున.. ఫుల్ ఎంటర్ టైన్మెంట్. ఇప్పటికే 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. 7వ సీజన్ కు రెడీ అవుతోంది. 6 వ సీజన్ లో కంటెస్టెంట్స్ యే కాదు వారి ఫెర్మార్మెన్స్ కూడా బాలేదని టాక్. దీంతో ఈసారి సెలబ్రిటీలను దింపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సీజన్ 7 కోసం హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ను దింపడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మీ కూడా బిగ్ బాస్ కు వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. రష్మీ.. జబర్దస్త్ షో తో బుల్లితెర అభిమానులకు ఎంతో దగ్గరయింది. ముఖ్యంగా సుధీర్- రష్మీ జంటతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఆమె బిగ్ బాస్ షోకు వస్తే ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఇదే విషయాన్నీ రష్మీతో చర్చించగా ఆమె ఒక షరతు విధించిందట. తనకు వారానికి రూ. 8 లక్షలు కావాలని డిమాండ్ చేసిందట. ఈ లెక్కన చూస్తే ఆమె చివరి వారం వరకు ఉంటే.. కోటి కన్నా ఎక్కువే సంపాదిస్తుంది..ఒక వేళ విన్నర్ గా నిలిస్తే ఆ అమౌంట్ బోనస్ అని చెప్పాలి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, మేకర్స్ అయితే రష్మీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ అయితే వస్తుంది. మరి ఈ విషయమై రష్మీ తేలా స్పందిస్తుందో చూడాలి.
పెళ్లి తరువాత కొత్త జంట చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్
ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లితో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ని రెండు రోజుల క్రితం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఈ జంటకు అభిమానులు, మీడియా శుభాకాంక్షలు తెలిపారు. సిద్దార్థ్ తన భార్యతో ఢిల్లీలోని సొంత నివాసానికి చేరుకున్నాడు. ఇక మొట్ట మొదటిసారి ఇంటికి వచ్చిన కోడలికి అత్తింటివారు పూలతో ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో భర్తతో కలిసి కియారా డ్యాన్స్ వేసింది. ఇక కొత్త కోడలి రాకతో ఒక్కసారిగా సిద్ కుటుంబం సంతోషాలలో తెలియాడింది. బంధుమిత్రులతో ఆ ఇల్లు కళకళలాడింది. ఇక ఆ వేడుక అనంతరం కొత్త జంట మీడియా మిత్రులకు స్వీట్స్ ఇచ్చి ఆశీర్వాదాలు కోరారు. వారే స్వయంగా మీడియా మిత్రులను కలిసి స్వీట్స్ అందజేశారు. ఇక వారు ఈ జంట సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. పెళ్లి తరువాత మొట్ట మొదటిసారి అత్తగారింట్లో కియారా అడుగుపెట్టింది. ఎరుపు రంగు దుస్తుల్లో కొత్త జంట అందరి మనసులను దోచేసుకున్నారు. ఇక ముఖ్యంగా సిద్ చేతిపై కి అని మెహందీ పెట్టి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మీడియా వారికి మీరే స్వయంగా స్వీట్స్ పంచడం బావుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మీరెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.