తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు..
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.
వారి తప్పిదం, వైఫల్యం వల్లే తిరుపతి ఘటన.. అంబటి సంచలన ఆరోపణలు..
తిరుపతి ఘటనపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. మానవ తప్పిదం వల్లే తిరుపతిలో ఆరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారన్నారు. దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగిందని.. అధికారులపై కోపాన్ని చూపించిన చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు.. అధికారులను తిట్టి తనపనై పోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని.. కానీ, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందన్నారు. ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు అంబటి రాంబాబు.. సనాతన ధర్మాన్ని కాపాడే పోరాట యోధుడు ఇంతవరకు ఏం మాట్లాడలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. ఘటనను మసిబూసి మారేడు కాయ చేయాలని చూశారని.. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే మృతుల ఆత్మ శాంతిస్తుందన్నారు. వైసీపీని అణిచి వేయాలని చూస్తే అగ్నిపర్వతంలాగా తయారవుతుందని వార్నింగ్ అంబటి రాంబాబు..
కొనసాగుతోన్న పెన్షన్ల వెరిఫికేషన్… ఆ తర్వాతే తొలగింపు..!
ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు పత్రాలతో వేలాది మంత్రి ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తప్పుడు మార్గంలో మెడికల్ సర్టిఫికెట్లు పొంది.. వాటితో దరఖాస్తు చేసుకుని పెన్షన్ల రూపంలో ప్రభుత్వ సొమ్ము నొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఏపీలో 8 లక్షల 18 వేల పెన్షన్ల కు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దివ్యంగుల పెన్షన్.. వివిధ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పెన్షన్లపై ప్రధానంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా తనిఖీలు నిర్వహిస్తోంది.. కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్, తలసేమియా.. ఇలా వివిధ కేటగిరీలుగా పెన్షన్ పంపిణీ జరుగుతోంది. నకిలీ సర్టిఫికెట్‌లతో పెన్షన్ తీసుకునేవారిని గుర్తించే పని పడిపోయింది ప్రభుత్వం. అయితే, మూడు నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగించనున్నారు.. జిల్లా స్థాయి అధికారులు… మెడికల్ టీమ్, ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పెన్షన్ తనిఖీలు కొనసాగిస్తున్నారు.. ఇక, తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక వేళ అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తిస్తే ముందుగా సంబంధిత పెన్షనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు అధికారులు.. ఆ తర్వాత పెన్షన్ తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.. తనిఖీ చేసిన డేటా మూడు నెలల తర్వాత ప్రకటించాలా…? లేక ప్రతి 15 రోజులకు ప్రకటించి.. నిర్ణయం తీసుకోవాలా? అనే విషయంపై చర్చిస్తోంది ప్రభుత్వం.. కాగా, వైసీపీ హయాంలో భారీ సంఖ్యలో అనర్హులకు పెన్షన్లు నమోదు చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.. అంతేకాదు.. అవి నకిలీ పెన్షన్లు అని తేలితే.. లబ్ధిదారుల నుంచి.. పెన్షన్ల మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామంటూ కూటమి నేతలు వ్యాఖ్యానించిన విషయం విదితమే..
తిరుపతిలో తొక్కిసలాట.. ఘటనా స్థలానికి పవన్ కల్యాణ్..
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు.. టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, రాజకీయ నేతలు ఇలా.. బాధితులను పరామర్శిస్తున్నారు.. ఇక, నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత.. స్విమ్స్‌కు వెళ్లిపోయిన పవన్ కల్యాణ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు..
“భూభారతి”కి గవర్నర్ ఆమోదం.. వీలైనంత త్వరగా అమలులోకి
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.. 2024 డిసెంబరు 18న అసెంబ్లీలో ఈ బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అదే నెల 20న శాసనసభలో, 21న శాసనమండలిలో బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సభలు ఆమోదించాయి. అనంతరం.. భూభారతి బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరింది. తాజాగా.. “భూభారతి” చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ చట్టంలో పాలు పంచుకున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని.. అందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. కాగా.. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస రెడ్డికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు.
సాయంత్రం హంస వాహనంపై విహరించనున్న సీతా రామచంద్రస్వామి..
శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని.. అందుకే ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందంటారు. చాంద్రామానం ప్రకారం కాకుండా.. సౌర మానం అనుసరించి సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో మార్గశిరం మాసం లేదా పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. రేపు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సీతా రామ చంద్రస్వామి వారికి.. ఈరోజు సాయంత్రం గోదావరిలో హంస వాహన సేవ కొనసాగనుంది. సాయంత్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకుంటాయి. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారి వేంచేసి.. గోదావరిలో విహరించుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు.. భక్తులు స్వామి వారి హంస వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
1978 సంభాల్ అల్లర్లపై మళ్లీ దర్యాప్తు..? చరిత్రలోనే అతిపెద్ద మత ఘర్షణలు..
ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ వర్గం రాళ్లదాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మరణించారు. జామా మసీదు పురానత హరిహర్ ఆలయాన్ని కూల్చేసి కట్టినట్లు హిందూ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం మరో వార్త వినిపిస్తోంది. 1978లో సంభాల్‌లో భారీగా మత ఘర్షణలు జరిగాయి. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ వదంతులను తిరస్కరించారు. “1978లో సంభాల్‌లో జరిగిన మత అల్లర్లపై తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే, అలాంటి ఏమీ లేదు” అని సంభాల్ పోలీసు సూపరింటెండెంట్ (SP) కృష్ణ కుమార్ బిష్ణోయ్ అన్నారు.
ఫేస్‌బుక్ పరిచయం.. భర్త నుంచి దొంగతనం చేసి లవర్‌తో పెళ్లి..
ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థకు గౌరవం లేకుండా పోతోంది. క్షణకాలం సుఖం కోసం చాలా కాపురాలు కూలిపోతున్నాయి. పిల్లలను, భర్తను వదిలేసి కొందరు మహిళలు ప్రియుడితో పారిపోతున్నారు. మరికొందరు ప్రియుడి సాయంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా పరిచమైన వ్యక్తులతో స్నేహం, ప్రేమగా మారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఓ వివాహిత సోషల్ మీడియాలో పరిచమైన వ్యక్తితో పారిపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచమైన యూపీ రాయ్‌బరేలికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో భర్త నుంచి భారత మొత్తంలో నగదు, బంగారాన్ని దొంగిలించింది. తన భార్యను సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తప్పుదోవ పట్టించినట్లు భర్త ఆరోపించారు.
రష్యాకు భారీ దెబ్బకొట్టేందుకు బైడెన్ ఎత్తుగడ.. దిగిపోయేలోపే అమలు!
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది. దీనికి అమెరికానే ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ కూడా రష్యాపై మెరుపు దాడులు చేస్తోంది. అయితే జో బైడెన్ మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నారు. కొత్త అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే బైడెన్ పదవి నుంచి దిగిపోయేలోపు.. రష్యాకు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో అమెరికాలో అధికార మార్పిడి జరగనుంది. ఇంకో పది రోజుల్లో బైడెన్ శకం ముగుస్తుంది. ట్రంప్ శకం ప్రారంభం కానుంది. అయితే ఈలోపే రష్యాకు భారీ షాక్ ఇచ్చేందుకు బైడెన్ సిద్ధమయ్యారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీయడమే కాకుండా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేసేందుకు బైడెన్ రెడీ అయ్యారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కొత్త ఆంక్షలు విధించబోతున్నట్లు యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. యుద్ధానికి కావాల్సిన బలమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా బైడెన్ పదవి నుంచి దిగేలోపు కూడా.. రష్యాపై భారీ దాడులు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ బ్లాక్‍బస్టర్.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో సంచలనం సృష్టించింది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది జూన్ 27, 2024న థియేటర్లలో విడుదలైంది. దాని గ్రాండ్ విజువల్స్, మహాభారత నేపథ్యం, ప్రభాస్ స్టన్నింగ్ ఫర్పామెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీ ఓటీటీలో కూడా సంచలనంగా నిలిచింది. ఇప్పుడు కల్కి 2898 AD మొదటిసారిగా టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. కల్కి 2898 AD జనవరి 12న సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ చిత్రం సంక్రాంతికి రెండు రోజుల ముందు టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శిస్తుంది. దీనిని జీ తెలుగు టీవీ ఛానల్ అధికారికంగా ధృవీకరించింది. కల్కి త్వరలో వస్తుందని జీ తెలుగు కొంతకాలంగా చెబుతోంది. అంటే ఇది సంక్రాంతి కానుకగా ప్రసారం అవుతుంది. ఈ క్రమంలో జీ తెలుగు ఇటీవల ప్రోమోలో ఈ సినిమా జనవరి 12న సాయంత్రం 5.30 గంటలకు ప్రసారం అవుతున్నట్లు వెల్లడించింది. దీనితో, కల్కి 2898 AD ఎంత టీఆర్పీ తెస్తుందనే విషయం పై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
అనుష్క కోసం రంగంలోకి దిగనున్న ప్రభాస్
అనుష్క శెట్టి ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె ఒకప్పుడు గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంధతి సినిమా తర్వాత తను కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా. అనుష్క పుట్టినరోజును సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా అనిపించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
గ్లింప్స్ తోనే నెంబర్ వన్ రికార్డ్ నమోదు చేసిన ‘టాక్సిక్’
‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు యష్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రానుంది. మలయాళంలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి యష్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 8న 10 గంటల 25 నిమిషాలకి సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఈ స్థాయిలో రెస్పాన్స్ సాధించిన సినిమాలు చాలా తక్కువ. టాక్సిక్ గ్లింప్స్‌కు వచ్చిన ఆదరణ యష్ పై అభిమానుల అంచనాలను మరోమారు ఖరారు చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: వేర్ ఈజ్ పుష్ప కూడా గతంలో భారీ వ్యూస్ సాధించింది. హిందీ వెర్షన్ విడుదలైనప్పుడే 27.67 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా 20.45 మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ ఒక్క గ్లింప్స్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. కానీ గ్లింప్స్ లో ఉన్న కంటెంట్ మాత్రం సినిమాలో హైలెట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.