రేపే కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి పక్కా పాటించాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతిస్తారు అధికారులు.. ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.. ఇక, ఎగ్జామ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని తెలిపారు.. అంటే.. పైన పేర్కొన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా.. పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని.. వాటని భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయడం లేదని పోలీసు నియామక మండలి పేర్కొంది.. ఇక, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష రాసే అభ్యర్థులు ఒక రోజు ముందుగానే.. పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తే మంచిదని.. కానీ, పరీక్ష రోజే.. ఎగ్జామ్ సెంటర్ వెతుక్కునే పనిలో ఉంటే.. పరీక్షకు ఆసల్యం అయ్యే అవకాశం ఉంటుందని.. ఒకరోజు ముందే సెంటర్ చూసుకుంటే.. టెన్షన్ ఉండదని చెబుతున్నారు.. ఇక, పరీక్ష రాసే అభ్యర్థులు.. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్ టికెట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచనలు చేసింది పోలీసు నియామక మండలి.. కాగా, మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైతే.. 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులున్నారు.. రేపు జరగబోయే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 997 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే శారు.. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లాల ఎస్పీలు పరిశీలించారు..
చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి..
ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కట్టబెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది.. ఈ మేరకు హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి.. ఆ తర్వాత సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు వైవీ సుబ్బారెడ్డి.. చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించినట్టు పేర్కొన్నారు.. ఇక, గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. గ్రామస్తులకు భజన, కోలాటం సామగ్రి అందించాలని, మానవాళి శ్రేయస్సుకు యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించారు.. ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు..
అమిత్‌షాను కలిసిన ఏపీ పారిశ్రామికవేత్తకు వై+ కేటగిరి భద్రత..
ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది… 2022 డిసెంబర్ 4వ తేదీన వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు.. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి.. తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్.. ఆ సమావేశంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన అమిత్‌షా.. 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై+ కేటగిరి భద్రత మంజూరు చేశారు.. ఇక, తనకు వై+ కేటగిరి భద్రత కేటాయించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ధీటుగా బీజేపీ పరుగులు.. బీఆర్‌ఎస్‌కు వీఆర్ఎస్సే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ ప్రజా పోరు యాత్ర ఉంటుంది.. 2024లో భారతీయ జనతా పార్టీ అనే రైలు అతివేగంగా, అత్యంత అద్భుతంగా ప్రయాణిస్తుంది.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ధీటుగా బీజేపీ పరుగులు పెట్టబోతోంది అని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేసిన స్టీల్ బెంచిలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి గురించి జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించాం.. ఈనెల 24న జరిగే కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ ఉంటుందని తెలిపారు. ఇక, ఆంధ్ర ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్.. ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని ప్రకటించి ఆ తర్వాతే ఆంధ్రలో అడుగు పెట్టాలన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర ప్రజలు స్వాగతించరు.. ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇప్పిస్తామని ప్రకటించారు. మా పార్టీ నేతలు ఎవరు బీఆర్ఎస్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని.. గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మం బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.. కానీ, అది మా పార్టీ కి సంబంధం లేని విషయంగా చెప్పుకొచ్చారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు
మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నటుడు, జనసేన నేత నాగబాబు. తాజాగా ఆయన కర్నూలులో మాట్లాడుతూ వైసీపీపై జనసేన నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ ఆయన మండిపడ్డారు. పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. వీరమహిళలు, జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని ఆయన వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలన్నారు. ఇదిలా ఉంటే.. నిన్న ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్‌లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది. ఈజాతర చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. నాగోబా జాతర తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
తెలంగాణలో మోడీ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు రానున్న ప్రధాని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అయితే.. ఈ నెల 19న ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ రద్దయింది. జనవరి 19వ తేదీన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సంక్రాంతి సందర్భంగా జనవరి 15న వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
మూడవరోజు ఐటీ సోదాలు..
హైదరాబాద్ లో శ్రీ ఆదిత్య హోమ్స్ లో మూడవరోజు ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఊర్జిత, ట్రెడెంట్ ప్రాపర్టీస్ లో సోదాలు చేపట్టారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాట్ల అమ్మకాలపై ఐటీ శాఖ వివరాలు సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో ఐటీ అధికారులపై ఆదిత్య హోమ్స్ సిబ్బంది ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఐటీ అధికారుల పై ఎండీ కోటా రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనున్నారు. ముగ్గురు అకౌంట్ ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా ఆదిత్య హోమ్స్ పై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని. శ్రీ ఆదిత్య హోమ్స్ కార్యాలయానికి చేరుకోనున్న ఐటీ శాఖ ఉన్నత అధికారుల బృందం చేరుకుని సోదాలు నిర్వహించనున్నారు. అయితే ఐటి సోదాలు జరుగుతున్న సమయంలో తప్పుడు ప్రచారం చేసిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని ఐటి అధికారులు హెచ్చరించారు.
రష్యా – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
రష్యా నుంచి గోవాకు వస్తున్న చార్టెడ్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హడలిపోయారు. అధికారుల హెచ్చరికతో రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు దారిమళ్లించి అక్కడ అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన సిబ్బంది ఏడుగురు ఉన్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.
టర్కీలో ఫ్లైయింగ్ సాసర్.. గ్రహాంతర వాసులొస్తున్నారని భయాందోళన
టర్కీ దేశంలో ఇటీవల అద్భుతం చోటుచేసుకుంది. బుర్సా పట్టణ వాసులకు గురువారం ఉదయం ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్ ఆకారం కనిపించింది. దీంతో అందరూ దానిని గ్రహాంతరవాసులు ఉపయోగించే వాహనంగా పరిగణించారు. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయపడ్డారు కూడా.. కానీ కాసేపటి తర్వాత అది ఫ్లైయింగ్ సాసర్ కాదని తేలిపోయింది. ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారందాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు పట్టణ వాసులు. కొంతమంది ఈ వింతను తమ కెమెరాలలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.
దారుణం.. స్వామి చెప్పాడని శ్మశానానికి తీసుకెళ్లి శవాల బూడిద తినిపించారు
పుణెలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని ఓ వివాహిత పట్ల ఆమె భర్త, అత్తమామలు అమానవీయంగా ప్రవర్తించారు. తాంత్రికుడు చెప్పాడని ఆమెను శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ శవాల బూడిదను తినిపించారు. మహిళ ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు బుధవారం.. భర్త, అత్తమామలు, తాంత్రికుడితో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
‘వందేభారత్’ ట్రైన్ పై రాళ్ల దాడి..
దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. మొన్న ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు.
ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో.. వందలాది మంది విధుల నుంచి తొలగింపు
ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.. ఆర్థికమాంద్యం ఎఫెక్ట్‌తో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలోపడిపోయాయి.. ఇప్పటికే ఐటీ రంగంలో లక్షలాది మంది ఉద్యోగులు కోల్పోయారు.. ఫ్రెషర్లను కూడా వదలడం లేదు.. ఖర్చు తగ్గించుకోవడం ఒకటైతే.. నైపుణ్యం లేనివారిని కూడా ఇంటికి పంపిస్తున్నాయి ఆయా సంస్థలు. తాజాగా, ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొంది.. దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగులందరూ ఫ్రెషర్లు మరియు అంతర్గత పరీక్షలలో పేలవమైన పనితీరు కనబరిచినందున వారిని తొలగించారు. శిక్షణ ఉన్నప్పటికీ పరీక్షల్లో పదే పదే విఫలమవడంతో 452 మంది ఫ్రెషర్లను తొలగించాల్సి వచ్చిందని విప్రో తెలిపింది. శిక్షణ ఉన్నప్పటికీ పరీక్షల్లో పదే పదే విఫలమవడంతో మేం 452 మంది ఫ్రెషర్లను తొలగించాల్సి వచ్చింది అని మీడియా పోర్టల్‌ల ప్రశ్నలకు సమాధానంగా విప్రో తెలిపింది. తొలగించబడిన ఉద్యోగులందరికీ వారి తొలగింపు లేఖలు అందాయి. ఉద్యోగులందరికీ శిక్షణ కోసం కంపెనీ రూ.75,000 ఖర్చు చేసిందని, షరతుల ప్రకారం పరీక్షలో ఫెయిల్ అయిన తర్వాత చెల్లించాల్సి ఉంటుందని, అయితే, ఈ మొత్తాన్ని కంపెనీ మాఫీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో, విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలను ఏర్పరచుకున్నాం.. దాని గురించి మేం గర్విస్తున్నాం.. ఈ ప్రమాణాలకు, మేం మా కోసం ఏర్పరచుకున్న ఈ ప్రమాణాలకు అనుగుణంగా, కొత్త ఉద్యోగులందరూ కంపెనీలో చేరాలని మేం భావిస్తున్నాం.. కేటాయించిన పనిలో నిర్దిష్ట నైపుణ్యాన్ని సాధించడానికి, మేం వారికి శిక్షణ కూడా ఇస్తుంటామని పేర్కొంది.
ఫ్రాంచైజీ రేసులో 30 కంపెనీలు..బీసీసీఐకి కాసుల వర్షం
మహిళా క్రికెటర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమెన్స్ ఐపీఎల్‌కు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా మొత్తం 30 సంస్థలు టెండర్ దరఖాస్తులు కొనుగోలు చేశాయి. మహిళల ఐపీఎల్ మొదటి సీజన్లో ఐదు జట్లు పోటీ పడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉండటం గమనార్హం. ఫ్రాంచైజీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జనవరి 21) ముగియనుండగా.. హల్దీరామ్స్ ఇటీవలే టెండర్ దాఖలు చేసింది. మహిళ ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం పది భారత నగరాలు, వేదికలతో బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. సంస్థలు సింగిల్‌గా.. ఒకటి కంటే ఎక్కువ నగరాలకు బిడ్ దాఖలు చేసేలా నిబంధనలు విధించింది. ఇందుకోసం ఎలాంటి ప్రాథమిక ధరను నిర్ణయించలేదు. ఈ బిడ్లు పదేళ్ల కాలానికి అమల్లో ఉంటాయని పేర్కొంది. పురుషుల ఐపీఎల్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పది ఫ్రాంచైజీలు మహిళల లీగ్‌కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేశాయి. అదానీ (గల్ఫ్ జెయింట్స్), కాప్రి గ్లోబల్ (షార్జా వారియర్స్) కూడా టెండర్ వేయనున్నాయి. సిమెంట్ కంపెనీలు చెట్టినాడ్ సిమెంట్, జేకే సిమెంట్‌లూ ఫ్రాంచైజీ కొనుగోలు పట్ల ఆసక్తితో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు స్పోర్ట్స్ లీగ్‌ల్లో ఆసక్తి కనబర్చని శ్రీరామ్ గ్రూప్, నీలగిరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్ కూడా రేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సంయుక్త యజమానులైన తెలుగు సంస్థ జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వేర్వేరుగా టెండర్ డాక్యుమెంట్లు తీసుకోవడం గమనార్హం. ఏపీఎల్ అపోలో, హల్దీరామ్ జట్టును కొనుగోలు చేసేందుకు ఉత్సాహంతో ఉన్నాయి.సీల్డ్ బిడ్లను జనవరి 25న ఓపెన్ చేసి బీసీసీఐ ఫ్రాంచైజీ విన్నర్లను ప్రకటించనుంది.
రఘు కుంచె ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రఘు కుంచె. ఇటీవల ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణరావు మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు కుంచె, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రఘు కుంచె తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తాగునీటి సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణరావు పనిచేశారు. హోమియోపతిగా కూడా ప్రజలకు సేవలందించారు. అయితే తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసిన రఘు కుంచె.. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి మరణంపై రఘు కుంచె శుక్రవారం తన సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా.. “మా నాన్నగారు కాలం చేయడానికి కొన్ని గంటల ముందు, నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, కుటుంబంతో సరదాగా గడిపారు. దూరంగా ఉన్నవారిని వీడియో కాల్‌లో పలకరించి, మరుసటి రోజు పొద్దున్నే లేచి, స్నానం చేసి, పూజలు చేసి, అల్పాహారం చేసి, తనకిష్టమైన మడత కుర్చీలో ఆనుకుని, జీవనాధారమైన భగవద్గీతను చదివి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. రోజూ ఎవరినీ బాధపెట్టని డాడీ.. చివరి క్షణాల్లో కూడా అలాగే వెళ్లిపోయారు… ఐ మిస్ యూ నాన్న” అంటూ రఘు కుంచె తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. తన తండ్రితో కలిసి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.
రష్మీ గౌతమ్ ఇంట విషాదం..
బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే.. ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రష్మీ గౌతమ్ కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరణించారు. అది ఎవరో కాదు.. రష్మీ అమ్మమ్మ. రష్మీ గౌతమ్ ఆమె అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా హృదయాలు బాధతో బరువెక్కాయి. మా కుటుంబమంతా సమావేశమై మా అమ్మమ్మ ప్రమీలా మిశ్రగారికి చివరిసారిగా వీడ్కోలు పలికింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ప్రభావం మాపై చాలా ఉంది. ఆమె జ్ఞాపకాలు మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఓ శాంతి” అని పోస్ట్ చేసింది రష్మీ గౌతమ్. ఆమెకు ధైర్యం చెబుతూ నెటిజన్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మెగా తుఫాన్… మూడోసారి వంద కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. A టు C సెంటర్ తో సంబంధం లేకుండా చిరు చేస్తున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూస్తుంటే యంగ్ స్టార్ హీరోల అభిమానులు కూడా అవాక్ అవుతున్నారు. ఇది కదా మెగాస్టార్ స్టామినా అంటూ మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. చిరు వంద కోట్ల షెట్ రాబట్టడం ఇదే మొదటిసారి కాదు, తన రీఎంట్రీ తర్వాత మొదటిసారి ఖైదీ నంబర్ 150 సినిమాతో చిరు వంద కోట్ల షేర్ ని రాబట్టాడు. ఆ తర్వాత సైరా సినిమాతో మరోసారి 100 షేర్ కి కలెక్ట్ చేశాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు కానీ ఈసారి అందరికీ ఫుల్ మీల్స్ పెడుతూ చిరు వంద కోట్లు రాబట్టాలి అంటే యావరేజ్ సినిమా చాలు అని ప్రూవ్ చేసింది వాల్తేరు వీరయ్య సినిమా. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో చిరువి మూడు సినిమాలు ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ఇస్తోంది. ఈ మెగా సక్సస్ ని ఎంజాయ్ చేస్తూ ఓవర్సీస్ లో మెగా ఫాన్స్ స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. మెగా వాచ్ పార్టీ అంటూ ఒకేసారి, ఒకేరోజు నార్త్ అమెరికాలోని 25 సిటీస్ లో వాల్తేరు వీరయ్య స్పెషల్ షోస్ వేస్తున్నారు. మెగా ఫాన్స్ పూనకాలు రిపీటింగ్ అంటూ ఈ మెగా వాచ్ పార్టీని ఎంజాయ్ చెయ్యబోతున్నారు.