మామిడి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి.. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..!
తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి.. షరతులు వర్తిస్తాయి..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు… అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు.. నిత్యం మామిడి రైతులు మార్కెట్ యార్డుకు వస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అనుమతి ఇచ్చారు.. ఇక, హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు పోలీసులు.. ఇప్పటికే హెలిప్యాడ్‌కు కూడా అనుమతి ఇచ్చారు పోలీసులు.. మరోవైపు, ఎలాంటి ర్యాలీలు, రోడ్డు షోలు చేయకూడదని స్పష్టం చేశారు.. ఈ మేరకు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు పోలీసులు..
ఇదేందయ్యా ఇది..! భర్త మీద కోపంతో పెన్నులు మిగింది.. చివరకు..!
పల్నాడు జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో ఓ యువతి కడుపులో నుంచి పెన్నులు బయటకు తీశారు వైద్యులు.. నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో ఆస్పత్రికి చేరిన యువతకి.. అనుమాతంలో సిటీ స్కాన్ చేశారు వైద్యులు.. దీంతో, కడుపులో పెన్నులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న పెన్నులు బయటకి తీశారు.. అసలు ఆ యువతి కడుపులోకి పెన్నులు ఎలా వెళ్లాయి..? ఎందుకు పెన్నులను మింగాల్సి వచ్చింది అని ఆరా తీస్తే.. భర్త మీద కోపంతోనే సదరు యువతి పెన్నులు మింగినట్లు సమాచారం..
ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌కి విద్యార్థుల ఉత్తరాలు..
ఒక్కసారి మా పాఠశాలకు రండి చూడాలని ఉంది అంటూ ఓ పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కి ఉత్తరాలు రాశారు.. తమ స్కూల్‌లో కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆ విద్యార్థులు.. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ధన్యవాదులు తెలుపుతూ.. ఒక్కసారి మా స్కూల్‌కి రండి.. మిమ్మల్ని చూడాలని ఉంది అంటూ ఉత్తరాలు రాశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఆరోవ తరగతి విద్యార్థులు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కి లేఖలు రాశారు.. మా స్కూల్‌లో మంచి విద్యాభ్యాసం అందించడానికి.. సౌకర్యాలు కల్పించినందుకు థ్యాంక్స్ చెబుతూ.. ఆ ముగ్గురికి ఉత్తరాలు రాశారు.. స్కూల్ దగ్గరలో ఉన్న పోస్ట్ బాక్స్ లో ఈ ఉత్తరాలు అన్ని పోస్ట్ చేశారు. మరి ఉత్తరాలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు చేరుతాయా..? విద్యార్థుల కోరిక మేరకు ముగ్గురిలో ఏ ఒక్కరైనా సీతానగరం పర్యటనకు వచ్చినప్పుడు.. ఆ స్కూల్‌ను సందర్శిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది..
కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత..!
నేడు ములుగు జిల్లా కేంద్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అయితే ఈ నిరసనకు పోటీగా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే నేడు జిల్లాలో మంత్రివర్యుల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టివలసిన నిరసన కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ములుగు జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన చేపడుతున్నారు. ములుగు జిల్లాకు వస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకి ఘట్టం దగ్గర ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. ఘట్టం నుంచి భారీ ర్యాలీగా వెంకటాపురం వాజేడుకు మంత్రుల కాన్వాయ్ చేరుకుంది. ఐకమరోవైపు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కార్యక్రమం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ములుగు చేరుకున్నారు. ఆ తర్వాత గాంధీచౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించాయి బీఆర్ఎస్ శ్రేణులు.
“వనమే మనం – మనమే వనం”.. పచ్చదనంతో పాటు మహిళా శక్తికే ప్రాధాన్యం..!
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వనమే మనం… మనమే వనం” అని పెద్దలు చెప్పిన మాటలను స్మరించుకుంటూ, పర్యావరణ పరిరక్షణే మన భవిష్యత్‌కు పునాదిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు “అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి” అని సూచిస్తూ, ఆ తల్లులు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సీఎం కోరారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటి, అవే మన పిల్లల్లా సంరక్షించాలన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా పచ్చదనంతో నిండిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈసారి బీహార్ ప్రజలు ఎటువైపు అంటే..! తాజా రిపోర్టులు వచ్చేశాయ్!
తాజాగా బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇంక్‌ఇన్‌సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మరోసారి అధికార ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలిపింది. దాదాపు 48.9 శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), ఇతర చిన్న పార్టీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోందని సంస్థ పేర్కొంది. 35.8 శాతం మంది రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాఘటబంధన్‌కు ఓటు వేస్తామని చెప్పారని స్పష్టం చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కు ఎక్కువ మద్దతు లభించింది. సీఎంగా తేజస్వి యాదవ్‌నే కోరుకున్నారు. రెండో స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇక 43.6 శాతం మంది పురుషులు ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. అలాగే మహిళలు కూడా బీజేపీ కూటమికే సపోర్టు చేశారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పారు కానీ.. నితీష్‌ను మాత్రం మరోసారి సీఎంగా అంగీకరించలేదు. 38.3 శాతం మంది తేజస్విని సీఎంగా కావాలని కోరుకోగా.. 35.6 శాతం మంది నితీష్‌ను కోరుకున్నారు. ఇక 4.6 శాతం మంది చిరాగ్ పాశ్వాన్‌ను, 2.3 శాతం మంది ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 12.3 శాతం మంది బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రిని చూడాలని కోరుకున్నారు. యాదవులు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు తేజస్వి కూటమికి మద్దతు తెల్పగా.. మిగతా అన్ని సంఘాలు ఎన్డీఏ వైపు ఉన్నాయి.
3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్‌లు.. ఆటో మార్కెట్‌లో సంచలనం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమి ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. దాని SU7 ఎలక్ట్రిక్ సెడాన్ తర్వాత, ఆ కంపెనీ ఇప్పుడు మరో కొత్త YU7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం, ఈ SUV చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ దాని బుకింగ్ వేగం ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. షియోమి నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన టెస్లా మోడల్ Y కి అతిపెద్ద పోటీదారు. ఇది రీజనబుల్ ధరతో స్పోర్ట్స్ కారులా కనిపిస్తుంది.. అంతేకాకుండా కోట్ల విలువైన లగ్జరీ కారు ఫీచర్స్ కలిగి ఉంది. Xiaomi YU7 బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే, కేవలం 3 నిమిషాల్లోనే 2 లక్షలకు పైగా యూనిట్లు బుక్ అయ్యాయి. , ఈ సంఖ్య కేవలం ఒక గంటలోనే 3 లక్షలకు చేరుకుంది. దీని ద్వారా మీరు దాని ప్రజాదరణను ఊహించవచ్చు. పోల్చితే, మునుపటి Xiaomi SU7 27 నిమిషాల్లో 50,000 బుకింగ్‌లను , 24 గంటల్లో 90,000 బుకింగ్‌లను అందుకుంది. YU7 మార్కెట్లో అద్భుతమైన స్పందనను పొందుతోందని ఇది స్పష్టం చేస్తుంది.
రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అభిమాని అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది. తాజాగా అదే తరహాలో బెంగళూరులో మరో ఘటన జరిగింది. మాజీ ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పది మందితో కూడిన ముఠా.. యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేశారు. దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా నిందితుల్లో ఒకరు పేర్కొనడం విశేషం.
ఇందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్
ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు, చేయను అని గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండీషన్స్‌కు మేకర్స్ ఓకె చెబితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. మంచి కథ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను అంగీకరిస్తుంది. అందులోను ఎలాంటి ఎక్స్‌పోజింగ్, రొమాన్స్ సీన్స్ లేకుండా చూసుకుంటుంది. అందుకే సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే చాలు ఆటో మేటిక్‌గా పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులెస్తున్న సాయి పల్లవి.. ఇటీవల తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామయణ’లో సీతగా నటిస్తోంది. కానీ ఇప్పటి వరకు సాయిపల్లవి రొమాన్స్ చేసిన సినిమాలు లేవు. ముఖ్యంగా లిప్ లాక్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తాం, ఫలానా స్టార్ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పిన సరే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే అమ్మడు చాలా సినిమాలను వదిలేసుకుంది. ఇక పై కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అంతే తప్ప అవకాశాల కోసం ఏనాడు తాను పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేయలేదు సాయి పల్లవి. బహుశా అదే ఆమెకు మంచి సినిమాలు వచ్చేలా చేసింది. ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేలా చేస్తుంది.
వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్‌లో సూపర్ పీక్ లో ఉంది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ విజయాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత బాధను పంచుకుంది. మీరు సెలవులు ఎలా ఎంజాయ్ చేస్తారు? అనే ప్రశ్నకు రష్మిక చాలా భావోద్వేగంగా స్పందించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘ నాకు ఒక చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడామెకు 13 ఏళ్లు. తనతో ఆడుకునేందుకు, అప్పట్లో వారాంతపు సెలవు కోసం ఏడ్చేదాని. కానీ ఇప్పుడు నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి, గత ఎనిమిదేళ్లుగా ఆమెతో సరైన సమయం గడిపే అవకాశం దక్కడంలేదు. అదే నన్ను ఎక్కువగా బాధిస్తుంది. గత ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్లలేదు. స్నేహితుల్ని కలవలేదు. వాళ్లు ఏదైనా ప్లాన్ చేస్తే ముందు నన్ను అడిగేవారు. కానీ ఇప్పుడు, నాకు సమయం ఉండదని వాళ్లే డిసైడ్ అవుతున్నారు. నాన్నమ్మ ఎప్పుడూ చెబుతుండేది. వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సిందే. రెండింటికీ సమతుల్యత అవసరం. అందుకే నేను రెండింటిని బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నా స్వగ్రామాన్ని మిస్ అవుతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు రష్మిక.
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. టైటిల్ ఇదే..
టాలీవుడ్ లోకి మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీ జరగబోతుంది. తన మాస్ సినిమాలతో మాస్ మహారాజ్ బిరుదు అందుకున్న రవితేజ ఫ్యామిలీ నుండి వారసుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అయితే రవితేజ కొడుకు కాదులెండి. ఆయన తమ్ముడులో ఒకరైన రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. వాస్తవానికి తన మొదటి సినిమాగా మిస్టర్. ఇడియట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాను హోల్డ్ లో పెట్టేసారు. ఇప్పుడు మాధవ్ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాకు డెబ్యూ దర్శకుడు నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘మారెమ్మ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. మోక్ష ఆర్ట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ను ఈ ఏడాది దసరా కానుకగా రిలిజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఆగస్టులో ‘మారెమ్మ’ గ్లిమ్స్ రిలీజ్ కానుంది. యంగ్ హీరోపై మేకర్స్ భారీ గానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. తమ హీరో ఫ్యామిలీ నుండి రాబోతున్న హీరో కావడంతో మహామహారాజ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుండి రాబోతున్న మాధవ్ పెద్దనాన్న రవితేజ లా నటించి మెప్పించి స్టార్ హీరోగా ఎదగాలని ఆశిద్దాం. మారెమ్మతో మాధవ్ ఏ మేరకు గుర్తింపు తెచుకుంటాడో చూడాలి.