కార్తీక పౌర్ణమి రోజూ బోసి పోయిన బాపట్ల బీచ్‌లు.. పోలీసుల ఆంక్షలతో..!
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. అయితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు సముద్ర స్నానాల కోసం బాపట్ల సూర్యలంక బీచ్‌కు తరలివచ్చే దృశ్యం ఈసారి కనిపించలేదు. మొంథా తుపాన్ ప్రభావంతో సముద్రంలో ప్రమాదకర గోతులు ఏర్పడటంతో అధికారులు ముందస్తు చర్యగా బీచ్‌ను మూసివేశారు. సాధారణంగా ఈ పుణ్యక్షేత్ర కాలంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు సూర్యలంక సముద్రతీరంలో పుణ్యస్నానం ఆచరిస్తుంటారు. అయితే, ఈసారి భద్రతా కారణాలతో పోలీసులు సముద్ర స్నానాలకు అనుమతించలేదు. జిల్లాలోని సూర్యలంక, ఓడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్‌లలోకి భక్తులు, యాత్రికులు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. బీచ్‌లకు వెళ్లే రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. అధికారుల నిర్ణయం వల్ల ఈసారి బాపట్ల బీచ్‌లు ఖాళీగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. సముద్రతీరంలో సాధారణంగా కనిపించే సందడి, భక్తి వాతావరణం కనిపించకపోవడంతో సూర్యలంక బీచ్ పూర్తిగా బోసిపోయింది.
ఏపీలో 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి.. తల్లి సంచలన ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్‌కి వేలాడదీశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మా అమ్మాయి అంత చిన్నది.. ఆత్మహత్య చేసుకునేంత వయసు లేదు.. అంతకుముందే నాతో మాట్లాడింది.. ఆ తర్వాత ఇలా ఎలా?” అని కన్నీరుమున్నీరు అవుతూ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి సునీత, “స్కూల్‌లో సీసీ కెమెరాలు పరిశీలించాలి. పూర్తి స్థాయి విచారణ జరపాలి,” అని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ముంబైలో ఉన్న రంజిత తండ్రికి సమాచారం అందించగా, ఆయన త్వరలో స్వగ్రామానికి చేరుకోనున్నారు. బాలిక మృతి వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు.. అన్న బాలయ్య ఆనందం..
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి లండన్‌లోని మే ఫెయిర్ హోటల్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇక, తన చెల్లి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే, నట సింహ నందమూరి బాలకృష్ణ.. సమాజ సేవలో చూపిన దృఢమైన నిబద్ధత, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను స్పర్శించిన మానవతా దృష్టికి గుర్తింపుగా ఈ అవార్డులు మాకు, తెలుగు ప్రజలకు గర్వకారణం అని హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “భువనేశ్వరి చెల్లెలు దూరదృష్టి, కృషి, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న సేవా భావం కోసం అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవాలు మనందరికీ ఆదర్శం, ప్రేరణగా ఉంటాయి” అని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు భువనేశ్వరి సేవాస్ఫూర్తి, నాయకత్వ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు హీరో నందమూరి బాలకృష్ణ.. కాగా, లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవం లభించింది..
కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. చలనచిత్ర పరిశ్రమలో విశిష్ట స్థానం..
కళలకు, కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లు కళలకూ, కళాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం సానుకూలం అని చెప్పారు. గతంలో ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలు షూటింగ్‌లకు విహార కేంద్రాలుగా ఉపయోగించబడినప్పటికీ, ఇప్పుడు పాపులేషన్ పెరగడం మరియు పొల్యూషన్ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు మంత్రి రామానాయుడు.. “విశాఖపట్నం నుంచి గోదావరి జిల్లాకు కోనసీమ సహజ అందాలతో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం, కొంతమందిని కళాకారులుగా తయారు చేయడానికి కృషి చేయడం సంతోషకరం” అన్నారు.. ప్రారంభోత్సవంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కృషి, కళాకారుల శిక్షణ, భవిష్యత్తులో రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు మంచి మద్దతు కల్పిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చలనచిత్ర పరిశ్రమలో పాలకొల్లుకు విశిష్ట స్థానం ఉందని అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు..
వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ప్రస్తుతం జగన్‌కు రాష్ట్ర పురోగతి అనేది అర్ధం కాదు. ఆయనకు పదవి కావాలి అని విమర్శించారు.. చంద్రబాబు అరెస్టు కూడా ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిపారు.. ఇప్పుడు జగన్ కి ఏదీ చెల్లడం లేదు… జగన్ కి పదవి కావాలి.. ధర్మ విస్మృతికి అలవాటు పడ్డాడు.. జలజీవన్ మిషన్, అమృత్ పధకాలు మనకు వస్తున్నాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తున్నాయి.. జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతున్నాం.. మా కూటమి పెరిగి పెరిగి అంతరిక్ష స్ధాయికి వెళుతున్నాం.. జగన్ ను థూ.. ఛా.. అనేలా చేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్ననే మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అయ్యాడు అని తెలిపారు ఆదినారాయణ రెడ్డి.. మహాతల్లి భారతి రెడ్డి 400 కేజీల బంగారం కొన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్న ఆయన.. పులివెందులలో ఎన్నికలలో నామినేషన్లు లేకుండా చేయడం వంటి చర్యలకు జగన్ మాట్లాడే హక్కు లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే రోజుల్లో అమరావతి పూర్తి చేస్తాం.. అభివృద్ధి పనులు ఒక్కో దశలో ప్రారంభమవుతాయని చెప్పారు. రెండు-మూడు కోట్ల ఇళ్లలో అధిక హోదాతో ఏపీకి భాగం వస్తుందని, బడ్జెట్ అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు మరోవైు, వైఎస్ వివేకా కేసుపై మాట్లాడుతూ.. అసలు నేరస్థులు దాక్కున్నారని, వివేకా హత్యలో అంతర్గత సంబంధాలపై అంశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.. ఇక, కాశీబుగ్గ ఘటన, లారీ అక్సిడెంట్, బస్సు దుర్ఘటనలు లాంటి సంఘటనలపై ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదు అన్నారు.. అప్పులు, తప్పులు, పెద్ద గొప్పలు అయిపోయాయి.. వచ్చిన 11 సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది అంటూ ఛాలెంజ్ చేశారు.
చేవెళ్ల ఘటన మరువక ముందే మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..
చేవెళ్లలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన మరిచిపోక ముందే, సంగారెడ్డి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ నుంచి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వరకు వస్తోంది. ముత్తంగి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయే క్రమంలో, బ్రేక్ పడకపోవడంతో బస్సు నియంత్రణ కోల్పోయింది. దీంతో బస్సు వేగంగా డివైడర్ ఎక్కి, పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, కండక్టర్ లక్ష్మయ్యతో పాటు కొందరి ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
తమపై చట్నీ పడేశాడని దారుణం.. అర్ధరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లతో కాల్చి హత్య..
హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటి మీద చట్నీ పడేశాడని ఓ వ్యక్తిని కొందరు యువకులు కిరాతంగా హతమార్చారు. రెండు గంటల పాటు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ చివరికి కత్తితో దారుణంగా హత్య చేశారు. ఈ నలుగురి నిందితులలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. నాచారంలో అర్ధరాత్రి 2 గంటలకు కారులో షికారు చేస్తున్న మహమ్మద్ జునైద్(18), షేక్ సైఫుద్దీన్(18), మణికంఠ (21), మరో బాలుడు(16) ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఎల్బీ నగర్ దగ్గర ఉప్పల్ కి చెందిన మురళి కృష్ణ లిఫ్ట్ అడిగాడు. ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి టిఫిన్ చేస్తుండగా.. ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ పడింది. దీంతో మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని.. లిఫ్ట్ ఇచ్చిన మా మీదే చట్నీ పోస్తావా అంటూ పిడి గుద్దులతో దాడి చేశాడు. రెండు గంటలు కారులో తిప్పుతూ.. సిగరెట్లతో కాల్చుతూ.. కత్తితో మురళి కృష్ణను పొడిచేశారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు కారు దూకి పారిపోతుండగా.. వెంబడించి మరీ దారుణంగా హత్య చేశారు. మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకుని మార్గ మధ్యలో కత్తి పడేసి మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి నలుగురు యువకులు పారిపోయారు. ఇక, విషయం తెలిసిన పోలీసులు నిందితులను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
బీహార్ పోలింగ్‌కు ముందు రాహుల్‌గాంధీ షాక్.. ‘ఓట్ చోర్’’పై కీలక ప్రజెంటేషన్
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు ఎడ్జ్ కనిపించిందని.. ఈవీఎంల లెక్కింపు సమయంలో ఫలితాలు తారుమారైపోయాయని చెప్పారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లు ఉంటే.. 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని తెలిపారు. కేవలం 22 వేల ఓట్ల తేడాతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఒక బీజేపీ నేత కుమారుడు రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎంలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. హర్యానాలో 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని వివరించారు. ‘‘బ్రెజిల్ మోడల్ మాథ్యూస్ ఫెరిరో ఫొటోతో 10 పోలింగ్ బూత్‌ల్లో 22 ఓట్లు ఉన్నాయి. ఒకే ఫొటోతో 253 ఓట్లు రెండు పోలింగ్ బూత్‌ల్లో ఉన్నాయి. ఇలాంటి ఫేక్ ఓట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. 1,24,177 ఫేక్ ఓట్లు ఉన్నాయి. ఈ అక్రమాలు బయటపడవద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేసింది . సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడంలేదు. డూప్లికేట్ ఓట్లను తొలగించే సాఫ్ట్‌వేర్ ఈసీ దగ్గర ఉంది. కానీ ఎందుకు డూప్లికేట్ ఓట్లు తొలగించడం లేదు. బీజేపీయే డూప్లికేట్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తుంది. యూపీ, హర్యానాలో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. యూపీ, హర్యానాలో బీజేపీ నాయకులకు ఓట్లు రెండు చోట్ల ఓట్లున్నాయి. హర్యానాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడున్నర లక్షల ఓట్లను తొలగించారు.’’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
జవహర్‌లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మమ్దానీ విజయం వెనుక చాలా చరిత్రనే ఉంది. ఇతడు ఇండియన్-అమెరికన్ కావడం కూడా విశేషం. ఇక మేయర్‌గా విజయం సాధించిన తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి జోహ్రాన్ మమ్దానీ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూను జ్ఞాపకం చేసుకుని ప్రసంగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన సందర్భంగా నెహ్రూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ‘‘ట్రిస్ట్ విత్ డిస్టనీ’’ నుంచి ప్రేరణ పొందినట్లుగా మమ్దానీ తెలిపారు. శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి 1947, ఆగస్టు 14న నెహ్రూ ప్రసంగించారు. ప్రసంగంలో త్యాగాలు, ఒక యుగం ముగింపు, భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తాజాగా మమ్దానీ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు.
ఇలాంటి మొబైల్ ఛార్జర్లు కొనొద్దు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం..!
ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఛార్జర్‌లను అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్ అఫైర్స్ (జాగో గ్రాహక్ జాగో)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “తరచూ ప్రజలు చౌకైన ఛార్జర్‌లను వెతుక్కుంటూ ఎటువంటి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లను కొనుగోలు చేస్తారు. ఈ నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లు మీకు, మీ స్మార్ట్‌ఫోన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి . CRS మార్క్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కొనకండి. CRS మార్క్ లేని ఛార్జర్ మీ ఫోన్, మీరు ప్రమాదకరం.” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే CRS మార్క్ ఎలా ఉంటుందో వివరించారు.
జట్టు పేరును మార్చేసిన కావ్య మారన్.. కొత్త పేరేంటంటే..?
ఏంటి.. కావ్య మారన్ యజమానురులుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు మారిందని అనుకుంటున్నారా..? ఆబ్బె.. అదేం కాదండి.. కాకపోతే పెరుమారింది మాత్రం కావ్య మారన్ యజమానురులుగా ఉన్న జట్టు పేరే. ఏంటి మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా..? ఆగండి.. ఆగండి.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇంగ్లాండ్‌లోని ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ (The Hundred)లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. భారతీయ మీడియా దిగ్గజం సన్ గ్రూప్ పూర్తిస్థాయి యాజమాన్యాన్ని స్వీకరించడంతో ఇప్పుడు అందులో ఉన్న ‘నార్తర్న్ సూపర్ చార్జర్స్’ జట్టు పేరు అధికారికంగా ఇప్పుడు ‘సన్‌రైజర్స్ లీడ్స్’ (Sunrisers Leeds)గా మార్చబడింది. 2026 సీజన్‌కు ముందు ఆధారిత జట్టు కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. యాజమాన్యం మార్పు, రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. సన్ గ్రూప్ 2025 ప్రారంభంలో యార్క్‌షైర్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వాటాలను 100 యూరో మిలియన్లకు పైగా మొత్తానికి కొనుగోలు చేసి ఈ ఫ్రాంచైజీపై పూర్తి అధికారం సాధించింది. ఈ అధికారిక పేరు మార్పు అక్టోబర్ 31, 2025న UKలోని కంపెనీస్ హౌస్‌లో దాఖలైంది.
వేకేషన్ మూడ్‌లో కాజల్ అగర్వాల్..భర్తతో రొమాంటిక్ మోమెంట్స్
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఫిల్మ్ షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన యర్రా వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్ సింపుల్ లుక్‌లో, స్మైల్‌తో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. భర్త గౌతమ్‌తో కలిసి తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు నెటిజన్లను ఫిదా చేశాయి. దంపతులు వైన్ టేస్టింగ్, బైక్ రైడింగ్, నేచర్ వాక్స్ చేస్తూ గడిపిన క్షణాలను ఫాలోవర్లతో పంచుకున్నారు. కాజల్ ఇటీవలే నటించిన “భగవంత్ కేసరి” సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఆమె కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు వింటున్నారు. వెకేషన్ పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.తాజా ఫోటోలతో కాజల్ మళ్లీ ఫ్యాన్స్ మనసులు దోచేస్తూ, “ఇదే కాజల్ చార్మ్!” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.
‘పెద్ది’ నుండి చికిరిచికిరి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే ట్యూన్‌తో హైప్ పెంచిన ప్రోమో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఒక బిగ్ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్ తో పాటు రామ్ చరణ్ యొక్క ఎనర్జిటిక్ హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. “చికిరి” పాటను .. నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇక పాట గురించి వీడియోలో దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇంకా రెహమాన్ మాట్లాడుకోగా.. పెద్ది గాడు (రామ్ చరణ్) తన గ్రామంలో హీరోయిన్ (జాన్వీ కపూర్)ను మొదటిసారి చూసే సందర్భంలో ఈ పాట వస్తుందట. ఆ క్షణంలో హీరో మనసులో కలిగిన భావాలను పదాల్లో మార్చినట్టుగా “కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి” అనే లైన్ లో రావాలి అంటూ బుచ్చిబాబు వివరణ ఇవ్వగా.