మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు పోలీసులు.. అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన వైసీపీ ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. అయితే, ర్యాలీగా వస్తున్న అంబటిని పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో, సీఐపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడమే కాకుండా దూషించడంపై ఆయా సెక్షన్ల కింద అంబటి రాంబాబు కేసు నమోదు చేశారు. అంబటితోపాటు ఆయన అనుచరుడు వినోద్ మరి కొంత మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు పట్టాభిపురం పోలీసులు.. కాగా, వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు, సీఐ గంగా వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వాగ్వాదం.. పరస్పరం వార్నింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన విషయం విదితమే..
లాసెట్ రాసిన రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్..
రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో లాసెట్ ఎగ్జామ్‌కి హాజరయ్యారు.. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10.30 గంటలకు వరకు జరిగిన లాసెట్ ఎగ్జామ్‌ను ఏబీ వెంకటేశ్వరరావు రాశారు. లా చెయ్యాలన్న ఆలోచనతో ఏవీ వెంకటేశ్వరరావు లాసెట్ కి అప్లయ్ చేశారు.. అయితే, లాసెట్ కి ఆలస్యంగా అప్లయ్ చేయడంతో ఎగ్జామ్ సెంటర్ ఒంగోలులో పడింది.. దీంతో, ఉదయం రోడ్డు మార్గం ద్వారా విజయవాడ నుంచి ఒంగోలు చేరుకున్న ఏబీ వెంకటేశ్వరరావు.. లాసెట్ రాశారు. ఆ తర్వాత విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు.. కాగా, గత చంద్రబాబు సర్కార్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. అయితే, దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించారు ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ నేపథ్యంలోనే ఆయన లాసెట్ రాశారనే చర్చ సాగుతోంది..
పర్యావరణాన్ని ప్రేమిద్దాం.. భవిష్యత్ తరాల భద్రతకై కృషి చేద్దాం..
వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు.. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్… పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు.. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన.. అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారవు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. గతంలో ఇంటి అడ్రెస్ కావాలంటే అదిగో.. ఆ మర్రిచెట్టు పక్కవీధిలో అనేవారు.. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాక్షించారు.. ఇక, అందరికి మనస్ఫూర్తిగా పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
మరికాసేపట్లో పెళ్లి.. అంతలోనే నవ వరుడు ఇలా..
ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆనందం నిండిన చోట విషాదం నెలకొంటుంది. ఇదే రీతిలో తాజాగా ప్రమాదం కారణంగా ఓ పెళ్లి నిలిచిపోయింది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడగా ఓచిన్నారి మృతిచెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఈ తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పెళ్లి బృందం కారును డీసీఏం వ్యాను డీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు మహేష్ తో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చిన్నారి రుద్ర (3) మృతి చెందింది. క్షత గాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఓ వధువు తో పెళ్ళి జరగాల్సి ఉండగా హెర్టిగా కారులో ఈ బృందం బయలు దేరింది. కొండగట్టు వద్ద ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాను వేగంగా వచ్చి డీకొట్టింది. ఈ ప్రమాదంతో ఈ రోజు జరుగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి వేడుక వేళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఢిల్లీలో మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలు.. ఏపీ నుంచి ఫైనలిస్టు ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతరమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటిన సంజనా వరద, తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనలిస్టుగా ఎంపికయ్యారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ జూలై 3 నుండి జూలై 13 వరకు ఢిల్లీలో జరగనుంది, ఇందులో దేశం నలుమూలల నుండి ఎంపికైన 30 మంది ఫైనలిస్టులు తలపడి, విజేతగా ఎంపికైన వారు థాయిలాండ్‌లో జరగనున్న మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2025 పోటీలో భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సంజనా, రాష్ట్ర సంస్కృతి, గౌరవం, వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రతినిధిగా నిలిపారు. ఇదే ఆమె మొదటి ప్రస్థానం కాదు. సంజనా 2023లో మిస్ టీన్ గ్లోబల్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె, 2024లో మలేసియాలో జరిగిన మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ పోటీలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. ఆమె గతంలో జైపూర్ వంటి ప్రఖ్యాత వేదికలపై కూడా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. సంజనా సాంఘిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పితా ఫౌండేషన్ ద్వారా అనాథలు, దివ్యాంగులకు సహాయంగా నిలుస్తూ మనుషుల పట్ల మానవత్వంతో కూడిన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలో నేషనల్ కాస్ట్యూమ్, టాలెంట్, ఈవనింగ్ గౌన్, ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్ రౌండ్లు జరగనున్నాయి. ఈ అన్ని విభాగాల్లో సంజనా తన సాంఘిక అవగాహన, వాక్చాతుర్యం, మరియు స్టేజ్ ప్రెజెన్స్‌తో బలమైన పోటీదారుగా నిలుస్తారని అంచనా. ఈ గొప్ప ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం మొత్తం ఆమెతో కలిసి ముందుకెళ్తోంది, మరియు ఆమె థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలో భారత్‌కి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నారు.
‘నేను హత్యకు గురయ్యాను’’ సీబీఐ దర్యాప్తు చేయండి.. ఇండోర్‌లో వెలసిన పోస్టర్లు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జంట రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 23న మేఘాలయలో అదృశ్యమయ్యారు. మే 11న వివాహం చేసుకుని హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. మే 23న కొత్త జంట అదృశ్యమైంది. 10 రోజుల తర్వాత లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అతడి భార్య సోనమ్ ఆచూకీ లభించలేదు. కానీ ఆమె ధరించిన రెయిన్‌కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు ఉండడంతో గాలింపు కొనసాగిస్తున్నారు. తాజాగా ఇండోర్‌లో రాజా రఘువంశీకి చెందిన పోస్టర్లు వెలిశాయి. అందులో ‘‘నేను హత్యకు గురయ్యాను. సీబీఐ దర్యాప్తు చేయండి.’’ అంటూ రాసి ఉన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఈ మేరకు పోస్టర్లు వేశారు. ఇప్పటికే రాజా రఘువంశీ సోదరుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. తాజాగా ఇంటి వెలుపల పోస్టర్లు వెలియడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ బుకింగ్ సమయంలో ఈ-ఆధార్ తప్పనిసరి
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. IRCTC వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉదయం టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, వెబ్‌సైట్ హ్యాంగ్ అయ్యే సమస్య తలెత్తుతుంది. కొన్నిసార్లు, వేగం తగ్గడం, బోట్‌ల కారణంగా, టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటుంది. ఈ సమస్యను తీర్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఈ-ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇది అమల్లోకి రానుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అయోధ్యలో మరో అద్భుతం.. రామ దర్బార్ప్రాణ ప్రతిష్ట
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో గురువారం మరో అద్భుతం చోటుచేసుకుంది. అంగరంగ వైభవంగా రామమందిర మొదటి అంతస్థులో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. వేద మంత్రోచ్ఛారణ, హవనంతో రామ దర్బార్ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి సముదాయంలో రాజారామ్, ఇతర దేవతలను ప్రతిష్టించారు. గతేడాది జనవరిలో జరిగిన మొదటి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగిన రెండవ కార్యక్రమం ఇది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక జూన్ 3న ప్రారంభమైంది. జూన్ 5న ముగింపు వేడుకతో ముగుస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ఆంజనేయ సేవా ట్రస్ట్ నిర్వహించింది. రామాలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు (రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు) ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు.
బంగారం మరింత ప్రియం.. ఒక్క రోజే రూ. 430 పెరిగిన తులం గోల్డ్ ధర
బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు తులంపై రూ. 430 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,960, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,130 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో రూ. 91,300 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పెరిగింది. దీంతో రూ. 99,600 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,450 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,750 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు పయనిస్తున్నాయి. నేడు కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,14,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2000 పెరిగింది. దీంతో రూ. 1,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
బెంగళూరు తొక్కిసలాట ఘటన.. స్పందించిన సచిన్!
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల వేళ పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. అందులో కొందరి పరిస్థితి విషంగా ఉంది. ఈ ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటన మాటలకందని విషాదం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఈ విచార సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన హృదయ విదారకం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ లోకనాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు.
హీరో విశాల్‌కు బిగ్ షాక్.. 30 శాతం వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం లైకాకు వడ్డీతో పాటు రూ.21 కోట్లు చెల్లించాలని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విశాల్, లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని, డబ్బు తిరిగి చెల్లించలేదని 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డబ్బు తిరిగిచ్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ ‘వీరమె వాగై చూడమ్’ సినిమా హక్కులను లైకాకు బదులు వేరే సంస్థకు అమ్మేశాడు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చివరకు ఈరోజు తీర్పు ఇచ్చింది.