మీ తొమ్మిదేళ్ళలో తెలంగాణకు ఒరిగింది శూన్యం
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. బషీర్ బాగ్ లాంటి చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు మన కళ్ల ముందే ఉన్నాయని, బీఆర్‌ఎస్‌తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు పేదలపై పడుతున్న భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలన్నారు. లేకపోతే కేసీఆర్ పాపంలో వారు కూడా భాగస్వాములవుతారని ఆయన వ్యాఖ్యానించారు. మీ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యమని ఆయన అన్నారు. మీ కుటంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయని, మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.
కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ రైట్
క్రికెట్‌లో.. ‘‘అంపైర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అంటుంటారు. అదే.. బిజినెస్ విషయానికొస్తే.. ‘‘కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని చెబుతుంటారు. ఇప్పుడు.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ‘‘సిటిజెన్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని సరికొత్త పిలుపునిచ్చారు. అందుకే తమ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా సర్కారీ కొలువును ఒక ఉద్యోగంలాగా పేర్కొనదని, ప్రభుత్వ సేవగా, ప్రజా సేవగా పరిగణిస్తుందని మోడీ అన్నారు. లక్షల మందికి ఉద్యోగాలిచ్చేందుకు ప్రధాని మోడీ గతేడాది రోజ్‌గార్ మేళా అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. లేటెస్టుగా.. 71 వేల 426 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. తమ ప్రభుత్వం.. ఉద్యోగాల నియామక ప్రక్రియలో సమూల మార్పులు తెచ్చిందని ప్రధాని మోడీ చెప్పారు.సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను మరింతగా క్రమబద్ధీకరించామని, పారదర్శకతను, వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నామని వివరించారు. అందువల్ల.. రోజ్‌గార్ మేళా.. తమ సర్కారుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని రాష్ట్రాలు సైతం రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తాయని ప్రధాని వెల్లడించారు.
కొడుకులు స్పందించారు.. మరి నాగ్ సంగతేంటి?
నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య ఇప్పటివరకు లోలోపల జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు బయటపడింది. అనుకోకుండా జరిగినా నందమూరి బాలకృష్ణ మాట జారారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని- నందమూరి కుటుంబాల మధ్య 1984 నుంచే విబేధాలు ఉన్నాయని, అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా అక్కినేని కుటుంబంపై నందమూరి కుటుంబం అక్కసు వెళ్లగక్కుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మరోసారి నందమూరి బాలకృష్ణ నోటినుంచి ఆ అక్కసు బయటపడిందని చెప్పుకొస్తున్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అన్న మాట పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ఈ విషయమై అక్కినేని నట వారసులు స్పందించారు. అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ పొలైట్ గానే స్పందించారు. “నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..” అంటూ చెప్పుకొచ్చారు. ఘాటుగా స్పందించకపోయినప్పటికీ కనీసం మాట్లాడారు.. కానీ, అక్కినేని నాగార్జున అది కూడా చేయకపోయేసరికి అభిమానులు మండిపడుతున్నారు.నాగార్జున ఎక్కడున్నారు..
లోకేష్ ది అనామక పాదయాత్ర
ఏపీలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. టీడీపీ నేత త్వరలో పాదయాత్రకు రెడీ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం లోకేష్ పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని విమర్శించారు. పనికిమాలిన యాత్రలతో అబద్ధాలు చెప్పబోతున్నారు. అప్పట్లో వైసీపీకి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పాదయాత్ర చెయ్యాలని చెప్పారు. లోకేష్ పాదయాత్రకు
ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర రాత్రి సమయంలో జరగలేదు. ఇదేం ఖర్మ పేరుతో చేపట్టిన యాత్రలు ఏమయ్యాయి? అమరావతి నుంచి అరసవల్లి యాత్ర ఎక్కడుంది? ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కూడా అంతే అని తలశిల రఘురాం దుయ్యబట్టారు. లోకేష్ యాత్రతో ఒరిగేదేం ఉండదన్నారు. ఆ పాదయాత్రకు ఎవరూ భయపడడం లేదని ఇంతకుముందే ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన పాదయాత్రకు, అనామకుడు లోకేష్ చేసే యాత్రకు చాలా తేడా ఉంది. వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తికి నమస్కారం చేసి యాత్ర ప్రారంభించటం ఏంటి? జగన్ పాదయాత్ర చీకటి ముగిసేసరికి ముగిసేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
అమరావతి రైతుల ఆవేదనకు చంద్రబాబే కారణం
ఏపీలో అటు వైసీపీని, ఇటు టీడీపీపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పొత్తులపై స్పందించారు బీజేపీ నేతలు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చేతకాని అసమర్ధ పాలనతో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని విమర్శించారు. చంద్రబాబు స్వార్ధపూరిత నిర్ణయం వల్లనే అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. జగన్ మూడు రాజధానుల డ్రామాకు కారణం చంద్రబాబు నాయుడే అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. 800 కోట్లతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. చంద్రబాబు కనీసం శాశ్వత శాసనసభ అయినా కట్టాడా??జగన్ ఈ మూడున్నర ఏళ్ళల్లో కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు అయినా కట్టారా?దోపిడిలో తేడా వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజా పోరు 2 పేరుతో 50 లక్షల ఇళ్ళను సందర్శించనున్నాం
చైనాకు ఏమైంది? అత్యల్ప వృద్ధిరేటు నమోదు
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకవని ఒక సామెత ఉంది. అదిప్పుడు చైనాకి సరిగ్గా సరిపోతుంది. ఆ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా ఏం లాభం? అంత గొప్ప పేరు కూడా కరోనా ముందు లోకువ అయిపోయింది. జీరో కొవిడ్ పాలసీ కారణంగా చైనా ఎకానమీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదురుతన్నటం కూడా దీనికి మరో ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో 2022వ సంవత్సరంలో ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు 3 శాతానికి పడిపోయింది. ఇది.. గడచిన అర్ధ శతాబ్ధంలో 2వ అత్యల్ప విలువ కావటం గమనించాల్సిన అంశం. చైనా వార్షిక స్థూల దేశీయోత్పత్తి.. అంటే.. జీడీపీ.. గతేడాది దాదాపు 17 పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది.. ప్రభుత్వ లక్ష్యమైన 5 పాయింట్ 5 శాతం కన్నా తక్కువని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ తెలిపింది. జీరో కొవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్లను పదే పదే అమలుచేయటం వల్ల మొదటికే మోసం వచ్చింది. అదే సమయంలో.. అధికార కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించటం సైతం తీవ్రంగా దెబ్బకొట్టింది. చైనా గ్రోత్ రేట్ 1974వ సంవత్సరంలో 2 పాయింట్ 3 శాతంగా నమోదైంది.
కనిపించని రిపబ్లిక్ డే ముందస్తు సందడి
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిపబ్లిక్ డే ముందస్తు జోష్ ఏమాత్రం కనిపించలేదు. నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు.. మార్కెట్ సెంటిమెంట్‌ను కుదిపేయడంతో ఫ్రంట్‌లైన్ సూచీలు ఇవాళ బుధవారం విపరీతంగా క్షీణించాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 850 పాయింట్లకు పైగా తగ్గిపోయింది. నిఫ్టీ.. బెంచ్ మార్క్ కన్నా దిగువకు పడిపోయింది.అయినప్పటికీ మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యూనీ లీవర్, హిండాల్కో, బజాజ్ ఆటో, టాటా స్టీల్ షేర్లు బాగా రాణించాయి. మరో వైపు.. అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్స్ భారీగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 773 పాయింట్లు కోల్పోయి 60 వేల 205 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 226 పాయింట్లు నష్టపోయి 17 వేల 891 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 8 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం డౌన్ అయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. బీఎస్‌ఈ బ్యాంకెక్స్ రెండు శాతానికి పైగా నేల చూపులు చూసింది. పవర్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ తదితర సూచీలు సైతం వెనకబడ్డాయి.వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. జొమాటో షేర్ ఘోరంగా.. 15 శాతం.. మునిగిపోయింది. ఫలితంగా 6 నెలల కనిష్టానికి.. అంటే.. 44 రూపాయల 35 పైసలకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 128 రూపాయలు తగ్గి గరిష్టంగా 56 వేల 841 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
సచిన్, కోహ్లీలలో ఎవరు బెస్ట్.. గిల్ తెలివైన సమాధానం
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకే సాధ్యమైన ఆటతో 20 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఎవరికి సాధ్యం కానీ రికార్డుల్ని క్రియేట్ చేశాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ.. కెరీర్ మొత్తం 100 సెంచరీలతో పాటు అత్యధిక పరుగుల ఘనతను అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్‌లానే నిలకడగా రాణిస్తూ.. ఒక్కో రికార్డును చెరిపేస్తున్నాడు. ఇటీవలే కెరీర్‌లో 73వ సెంచరీ చేసిన విరాట్.. సచిన్ 100 సెంచరీ రికార్డును అధిగమించే దిశగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ నడుస్తోంది. ఇదే విషయమై స్పందిస్తూ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలివిగా సమాధానం చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత గిల్‌ను ఈ ప్రశ్న అడగగా ఇలా స్పందించాడు. “నా వరకు కోహ్లీనే బెస్ట్. ఎందుకంటే నేను విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. సచిన్ సార్ వల్లే నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టా. సచిన్‌కు మా నాన్న వీరాభిమాని. అందుకే నన్ను క్రికెటర్‌గా మార్చాలని ఆయన కలలు కన్నారు. ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయానికి నేను ఇంకా చిన్న పిల్లాడినే. నేను క్రికెట్‌ను అర్థం చేసుకోవడం మొదలెట్టాక నాకున్న రోల్ మోడల్ విరాట్ భాయ్ మాత్రమే. విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ బ్యాటింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే నాకు విరాట్ భాయ్ రోల్ మోడల్” అని గిల్ చెప్పుకొచ్చాడు.