ఆస్కార్ బరిలో “నాటు… నాటు…” సందడి!
ఎప్పుడెప్పుడా అని భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఆస్కార్ అవార్డుల నామినేషన్స్’ ప్రకటన వెలువడింది. మన భారతీయ సినిమా అభిమానులు, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆశించినట్టుగానే రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీల్లో రూపొందిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో నామినేషన్ లభించింది. వీటిని రిజ్ అహ్మద్, ఆలిసన్ విలియమ్స్ ప్రకటించారు. మనవాళ్ళు ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూడటానికి కారణం – గత యేడాది టాప్ గ్రాసర్ గా నిలచిన రాజమౌళి మేగ్నం ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ బరిలో ఉందని తెలియడమే. పైగా ఇప్పటికే ఈ చిత్రం ద్వారా బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా నిక్ పావెల్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకున్నారు. దాంతో ‘ట్రిపుల్ ఆర్’ ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదిస్తే, మన దేశం నుండి అకాడమీ నామినేషన్ సంపాదించిన తొలి హిందీయేతర చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలుస్తుంది.
కొత్త సచివాలయం పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రమే పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ సభకు మించి.. అత్యధికంగా జనాన్ని సమీకరించి తమ బలాన్ని ప్రదర్శించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ విజయవంతమైందని, మలి సభను అంతకుమించి సక్సెస్ చేయాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం.. ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్ సభకు ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్ సీఎం మమతతో పాటు మరో ముఖ్యమంత్రిని, ఇతర రాష్ట్రాల మాజీ సీఎంలు, ముఖ్య నేతలను సంప్రదించారని తెలుస్తోంది.
పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ కు బెదిరింపు లేఖ
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ లేఖను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని జైలు నుంచి ఓ ఖైదీ పంపినట్లు తేలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని జైలు నుంచి ఒక ఖైదీ రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన రాయగఢ్‌లోని స్టీల్ ప్లాంట్‌కు బెదిరింపు లేఖ పంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ లేఖ గత వారం పత్రపాలి గ్రామంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) కర్మాగారానికి పోస్ట్ ద్వారా పంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 48 గంటల్లోగా డబ్బు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ వ్యాపారి రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. బిలాస్‌పూర్ కేంద్ర కారాగారంలోని ఖైదీ లేఖ రాసినట్లు దర్యాప్తులో వెల్లడైంది, దీని తర్వాత కోత్రారోడ్ పోలీసులు సోమవారం అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
ఆ యువ నాయకుడికి జైలు ఖాయం
టీడీపీ నేతలపై మండిపడ్డారు వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. విశాఖలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడి గా ప్రజల ముందుకు వస్తున్నాడు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే వాళ్ళ పుట్టుక సక్రమమైనదేనా అనే అనుమానం కలుగుతోంది. వందరూపాయలు చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయక మహిళల ప్రాణాలు తీశారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా వాళ్ళకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా….? చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు….అన్ స్థాపబుల్ లో హంతకులు ఇద్దరు ఒకరిని ఒకరు సమర్ధించుకున్నట్టు అనిపించింది. ప్రతిపక్షాలు ప్రజా కంటకంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తెచ్చిందే అమరావతి ఆత్మగౌరవ నినాదం అని విమర్శించారు లక్ష్మీపార్వతి. సిపిఐ నారాయణ, రామకృష్ణ లు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు మనసు, శరీరం కుళ్ళి పోయాయి.. ఎన్.టి.ఆర్ కు చేసిన మోసం, అన్యాయాలకు క్షోభించి క్షీణించిపోయే రోజులు చంద్రబాబు కు ఎంతో దూరంలో లేవు. సహవాస దోషంతో పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. చంద్రబాబుతో కలిసి వెళ్లడం వల్ల పవన్ కళ్యాణ్ కు నష్టం మిగులుతుందన్నారు.
పాలమూరులో టెన్షన్.. టెన్షన్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మార్పీఎస్, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్ వద్దకు చేరుకుని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు.కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. మరోవైపు పోలీస్ వాహనం సైతం ధ్వంసం కావడంతో.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ.
వైసీపీ సర్కార్ అన్నిటా విఫలం..ప్రతిగ్రామంలో పాదయాత్ర
ఏపీలో అధికార వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో వున్న రెండు కుటుంబ పార్టీలను ఓడించడానికి బీజేపీ కృషి చేస్తుంది, జనసేన బీజేపీతోనే వుంది..ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయింది..చంద్రబాబు పాలన నుంచి జగన్ పాలనలో వరకు చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ప్రజల పరిస్థితి మారిందన్నారు. అన్ని వనరులను దోచుకోవడం, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా వైసీపీ మారింది.. హుండీ ఆదాయం ఇతర మతాలకు పంచి పెడుతున్నారు..పోరు యాత్ర-2 పేరుతో ప్రతి గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి కృషిచేస్తాం అన్నారు సునీల్ దియోధర్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల పాలుకావడం, ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లో వైసీపీ ప్రభుత్వం వుంది..బీజేపీపై మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తూ టిడిపి,బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..వేల కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ,టిడిపి వాళ్ళని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు.
జీవో 1పై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం
ఏపీలో కీలకంగా మారిన జీవో నెంబర్ 1పై వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై పొలిటికల్, నాన్ పొలిటికల్ పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించాం అన్నారు. 2008లో ప్రజారాజ్యం సభలో జరిగిన తొక్కిసలాట అనంతరం సర్క్యులర్ ఇచ్చారు.ఆ సర్క్యులర్ ను అమలు చేయాలని కోరాం. 15 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. 2008లో సర్క్యులర్ కు ప్రస్తుత జీవో 1 మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం లేదని వాదించాం అన్నారు జంధ్యాల రవిశంకర్. సిఎం కు బ్యానర్లు కడుతున్నారు… ప్రతిపక్షాలు కడుతుంటే తొలగిస్తున్నారు. అందరూ వాదనలు వినిపించారు, ఎజి ప్రభుత్వ విధానాలను వివరించారు. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. అన్ని కోణాల్లో వాదనలను ధర్మాసనం విన్నారు కాబట్టి మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.
అడవి శేష్ ఇంట పెళ్లి బాజాలు
యంగ్ హీరో అడవి శేష్ ఇప్పటికీ ఎలిజిబుల్ బ్యాచిలరే! అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఎంతో మంది ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ పెళ్ళి గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి… ఇంకా టైమ్ ఉంది… కెరీర్ ముఖ్యం అంటూ శేష్ దాటవేస్తూ వస్తున్నాడు. ‘మేజర్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శేష్ కు గత యేడాది ‘హిట్ 2’ రూపంలో సెకండ్ సక్సెస్ కూడా దక్కింది. విశేషం ఏమంటే… ఇప్పుడు అతని ఇంటిలో పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఆగండాగండి… ఇవి శేష్ పెళ్ళి సందర్భంగా మోగుతున్న బాజాలు కావు. అతని చెల్లెలు షెర్లీ పెళ్ళి కారణంగా మోగుతున్నాయి. అడివి శేష్ తండ్రి చంద్ర ఆంధ్ర యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించి, ఆ పైన అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఆయన కుమారుడు శేష్ చిత్ర సీమలోకి అడుగుపెడితే, అతని చెల్లెలు షెర్లీ డాక్టర్ చదివింది. ఈ నెల 26న ఆమె వివాహం అమెరికాకు చెందిన డేవిన్ గుడ్రిచ్ తో జరుగబోతోంది. పెళ్ళి వేడుకలన్నీ హైదరాబాద్ అవుట్ కట్స్ లో ప్లాన్ చేశారు. ఈ వివాహం కోసం వరుడి కుటుంబ సభ్యులు ఫ్లోరిడా నుండి హైదరాబాద్ కు వచ్చారు. తన చెల్లి వివాహానికి సంబంధించిన హల్దీ, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అడివి శేష్ మీడియాకు విడుదల చేశాడు. కేవలం వందమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరుపుతున్నట్టు సమాచారం.
5జీ సేవల్ని దేశమంతటా విస్తరించే పనిలో రిలయెన్స్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన 5జీ సేవల్ని దేశమంతటా విస్తరించే పనిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశంలోని మరో 50 సిటీల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కొత్తగా సర్వీస్‌లు ప్రారంభించిన నగరాల పరిధిలోని యూజర్లు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను యూజ్ చేసుకోవాలని కోరింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చని చెప్పింది. ఈ కొత్త నగరాలతో మొత్తం దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైందని ఈ టెలికాం సంస్థ పేర్కొంది.”మొత్తం 17 రాష్ట్రాల పరిధిలో మరో 50 నగరాలకు 5జీ సేవల్ని విస్తరించడం ఆనందంగా ఉంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక ఒకేసారి ఇన్ని నగరాలకు విస్తరించడం ఇదే తొలిసారి” అని రిలయన్స్ జియో ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఘండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల పరిధిలోని కొన్ని నగరాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తాజాగా 5జీ సేవలను ప్రారంభించినట్లు జియో వెల్లడించింది.