ఇవాళ హస్తినకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఎల్లుండి (ఈ నెల 14న) బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇవాళ రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు సీఎం. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని, జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ లు కార్యాలయం ప్రారంభ పనులను చూసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రులంతా..ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని కేసీఆర్ ఆదేశించారు. శాశ్వత భవనం నిర్మాణంలో ఉన్నందున.. ప్రస్తుతానికి ఒక భవనాన్ని పార్టీ కార్యకలాపాల నిమిత్తం అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. దాన్నే సీఎం కేసీఆర్ 14న ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ కార్యాలయంలో ఇప్పటికే పెయింటింగ్, రిపేర్ వర్క్స్ పూర్తయ్యాయి. కార్యాలయానికి చేయాల్సిన మార్పులపై సిబ్బందికి ఇదివరకే పలు సూచనలు చేశారు కేసీఆర్. మూడు రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సర్ధార్ పటేల్ రోడ్ లో భారీ భవనాన్ని బీఆర్ఎస్ కోసం ఏడాది పాటు అద్దెకు తీసుకున్నారు.
భారీగా విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిరిండియా
చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదుర్చుకోనుంది ఎయిర్ ఇండియా. త్వరలోనే సంస్థ 500కొత్త విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకూ ఎయిర్‌బస్, బోయింగ్ ఈ డీల్ విషయంలో స్పష్టమైన సమాచారం లభించలేదు. టాటా గ్రూప్ తరపున నుంచి కూడా ఏ విధమైన ప్రకటన లేదు. కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన ఏ350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి.
పసిడి ప్రియులకు షాక్.. పరిగెత్తుతున్న ధర
బంగారం కొనేవారికి ఇది గడ్డుకాలం. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారు దారి ధర చూసుకోవాల్సిన సమయం. ఈ వారంలో పసడి ధర పరిగెత్తుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1797.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 23.49 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.46 వద్ద ఉంది. ఇక దేశీయంగా చూస్తే బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.49,900 వద్ద ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో రూ.700 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.55 వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్యూర్ 24 క్యారెట్ల గోల్డ్ రేటు పదిగ్రాములు రూ.54,400 వద్ద నమోదవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఆల్ టైమ్ హై లో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.73 వేల వద్ద ఉంది.
సభల్లో మహిళా ప్రతినిధులకేదీ చోటు?
‘అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం’ అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. అయితే మహిళల ప్రాతినిధ్యం రానురాను తగ్గిపోతోంది. లోక్‌సభలో 14.94 శాతం, రాజ్యసభలో 14.05 శాతం మాత్రమే మహిళా ప్రతినిధులు వున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు వివరాలు వెల్లడించింది కేంద్రం. దేశవ్యాప్తంగా పార్లమెంటు సహా వివిధ శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో వీరి సంఖ్య 10 శాతం లోపే ఉంది. 10 శాతాన్ని మించి ఛత్తీస్‌గఢ్ (14.44), పశ్చిమబెంగాల్ (13.70), జార్ఖండ్ (12.35), రాజస్థాన్ (12), ఉత్తర్‌ప్రదేశ్ (11.66), ఉత్తరాఖండ్ (11.43), దిల్లీ (11.43), పంజాబ్ (11.11), బిహార్ (10.70), హరియాణా (10) ఉన్నాయి. 10 శాతం కంటే మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి. మొత్తం మీద దేశంలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పరిశీలిస్తే..వారి వాటా కేవలం ఎనిమిది శాతంగానే ఉంది. లోక్‌సభలో మహిళా ఎంపీలు 14.94 శాతం, రాజ్యసభలో 14.05 శాతంగా ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడించారు.
పెళ్లిలో గొడవ… ముక్క దొరకలేదని దబిడిదబిడే
ముక్క’ దొరకలేదన్న కోపంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం, వ్యవహారం పెళ్లి ఆగిపోయేదాకా వెళ్లడం లాంటి సంఘటనల్ని మనం ఎన్నో చూశాం. కేవలం ముక్క కోసమే కాదు, ఇంకా మరెన్నో కారణాలతో ఇరు కుటుంబాలు భౌతిక దాడులు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. లేటెస్ట్‌గా ఫోటోల కోసం బంధువులు కొట్టుకున్న మరో విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మేమంటే మేము ముందు ఫోటోలు దిగుతామంటూ వాదనకు దిగి.. చివరికి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియా జిల్లా మాధవ్‌పూర్ గ్రామానికి చెందిన ఒక అబ్బాయికి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు అబ్బాయి, అమ్మాయి తరఫు బంధువులు బాగానే వచ్చారు. వరమాల పూర్తయ్యేంతవరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అందరూ బాగానే పలకరించుకుంటూ, సరదాగానే గడిపారు. కానీ, వరమాల పూర్తైన వెంటనే అసలు డ్రామా మొదలైంది.
కొండా సురేఖ రాజీనామా..నెక్ట్స్ ఏంటి?
తెలంగాణ కాంగ్రెస్ కి షాక్ తగిలింది. కాంగ్రెస్ నిన్న AICC రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ (Konda Surekha) రాజీనామా చేశారు. ఇది తనను అవమానించడమే అని పదవులు ముఖ్యం కాదు ఆత్మాభిమానం ముఖ్యం అని కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)కి కు బహిరంగ లేఖ రాశారు. కొత్త కమిటీలో వరంగల్ నేతల పేర్లు లేకపోవడం బాధ కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు. ఆమె రాజీనామా పార్టీలో కలకలం కలిగిస్తోంది.
సూర్యాపేటలో విషాదం.. భార్యభర్తల మృత్యువాత
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అనంతగరి – కోదాడ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అనంతగిరి మండలంలోని వెంకట్రాపురంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు తిరుమలాయపాలెం మండలం జిల్లేపల్లి గ్రామానికి చెందిన 13 మంది బంధువులు ఓ ఆటో వెళ్లారు. అనంతరం గ్రామానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో అనంతగిరి మండలంలోని అనురాగ్ కాలేజీ సమీపంలో గోల్ తండా గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో శబరిమలై వెళ్తున్నారు.ఈ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఒకరు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారిద్దరూ దంపతులే..
యాభై రోజుల్లో మూడు దశాబ్దాల రజినీ రికార్డ్ కి ఎండ్ కార్డ్
దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా చెక్కు చెదరకుండా ఉన్న రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేశారు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేయడంతో ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గత వారంలో బాహుబలి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి, జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ రెండో స్థానంలో నిలిచింది. జపాన్ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి వస్తుండడంతో, ఆర్ ఆర్ ఆర్ సినిమా ‘ముత్తు’ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరూ అనుకున్నట్లే సరిగ్గా వారం తిరిగే సరికి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ముప్పై సంవత్సరాల నుంచి చెక్కు చెదరని రజినీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.