రేపటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపటి నుంచి పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది. ఇవాళ అర్దరాత్రి 12 గంటల తరువాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం రేపు ఉదయం 1.45 నిముషాలకు ప్రారంభం కానున్నాయి వీఐపీల దర్శనాలు. ఉదయం 5 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచి టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఎల్లుండి ఉదయం 4 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోనూ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీప్రకియ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచే టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. దీంతో భక్తుల సందడి నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం 5.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం. 3లో మూడు కార్లు ఢీకొన్నాయి. అతివేగంగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి, ఆగి ఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిని దగ్గరలోనే ఉన్న ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. టైర్లు విడిపోయి, దూరంగా వెళ్లి పడ్డాయి. కార్లలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఒక కారు వేగంగా గుద్దడంతో.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పది అడుగుల పైకి ఎగిరి, ఎదురుగా ఉన్న ఒక షాప్ ఫ్లెక్సీతో ఢీ కొట్టారు. దీంతో వాళ్లు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. భట్టి విక్రమార్క సందేశం

2023 సంవత్సరంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ 2023 నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మంచి ఆశయాలను కలిగి, వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసంవత్సరం రాష్ట్రంలో పాడి-పంటలు సమృద్ధిగా పండాలని, పండిన పంటకు గిట్టుబాటు ధర పొంది రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేయకుండ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పని చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా విస్తరించే ప్రమాదం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకుండ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైతం స్వీయరక్షణ పాటించి కరోనాకు చెక్ పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఏడాదిలో కృషి చేయాలని కోరారు.
విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం.. జెలన్ స్కీ న్యూఇయర్ సందేశం

ఉక్రెయిన్ విజయం సాధించే వరకు రష్యాతో పోరాడుతూనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధంలో పాల్గొని మరణించిన ఉక్రెయిన్ సైనికులకు నివాళులు అర్పించారు. ‘‘మేము విజయం కోసం పోరాడుతాం.. పోరాడుతూనే ఉంటాం’’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు నిర్వహించిన కొన్ని గంటల్లోనే జెలన్ స్కీ తన ప్రకటనను వెల్లడించారు. యుద్ధంలో పాల్గొంటున్న వారందరిని ప్రశంసించారు. ఉక్రెయిన్లు చాలా దైర్యవంతులని.. మేము ఏమి చేశామో.. ఏం చేయబోతున్నామో చూడండి అని అన్నారు. మన సైనికులు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యంతో పోరాడుతున్నారని అని వెల్లడించారు. మా ప్రజలు రష్యాను నిలువరించారని.. గొప్ప యుద్ధంలో చిన్న విషయాలు లేవని ఆయన అన్నారు. మనలో ప్రతీ ఒక్కరూ పోరాట యోధులే అని జెలన్స్కీ అన్నారు.
దిగజారిన పాకిస్తాన్ పరిస్థితి.. సిలిండర్లు లేక ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్

పాకిస్తాన్ లో పరిస్థితి మరింతగా దిగజారింది. గ్యాస్ సిలిండర్ల లేక ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అక్కడ గృహ వినియోగానికి గ్యాస్ సిలిండర్ ధర రూ.2,500 గా ఉంది. అదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే రూ.12 వేలుగా ఉంది. వాస్తవానికి కొన్నేళ్లుగా పాకిస్థాన్ ను గ్యాస్ కొరత వేధిస్తోంది. అది కూడా శీతాకాలం రాగానే ఆ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలోనే గృహ, పారిశ్రామిక అవసరాల కోసం పాకిస్థాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ని దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే గ్యాస్ నిల్వలు సరిపడా లేక.. ఉన్న వాటికి ఎక్కువ ధర పెట్టలేక వంటను కట్టెల పొయ్యిమీద చేస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. దాని వల్ల తమ ముఖాలు మసిగొట్టుకుపోతున్నాయని గృహిణులు ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా బంధువులు వచ్చినా వారికీ ఏమీ చేసిపెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు.
హర్యానాలో భూకంపం.. . ఢిల్లీలో ప్రకంపనలు

కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. హర్యానా భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. అంతకు ముందు నవంబర్ నెలలో నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి.ఇటీవల తరుచుగా హిమాలయ రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపాలు రావడం ప్రజల్ని కలవరపరుస్తోంది. హిమాలయ దేశం నేపాల్ లో కూడా భూకంపాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భూ అంతర్భాగాల్లో జరిగే చర్యల వల్ల ఈ శక్తి భూకంపాలుగా మారుతున్నాయి
అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు

ఓవైపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తాగి నడపడం వల్లే అతని కారు ప్రమాదానికి గురైందంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. తాగిక మైకంలోనే పంత్ డివైడర్‌ని ఢీ కొట్టాడని, లేకపోతే ఈ ప్రమాదం సంభవించేదే కాదని చెప్తున్నారు. అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదంటూ, ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ మద్య సేవించలేదని, అతడు తాగి కారు నడపలేదని, ఇవన్నీ తప్పుడు వార్తలు స్పష్టం చేశారు. ఒకవేళ పంత్ తాగి కారు నడిపి ఉంటే.. అంత దూరం ఎలాంటి వస్తాడని తిరిగి ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు పంత్ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారన్నారు.