సూడాన్ ఆర్మీ, పారా మిలటరీ మధ్య తీవ్ర ఘర్షణ
సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాన ఖార్టూమ్ కాల్పుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది. ఇదిలా ఉంటే సూడాన్ లో ఉన్న భారతీయులకు, ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని, ఇంటికే పరిమితం కావాలని, బయటకు వెళ్లడం మానేయాలని సూచించింది. అప్డేట్స్ కోసం వేచి ఉండాలని ట్వీట్ చేసింది. పారామిటిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్)ని సాధారణ సైన్యంలో ఏకీకృతం చేయడంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దేశంలో ఆర్మీ చీఫ్ గా ఉన్న అబ్దెల్ ఫత్తా అల్ బుర్షాన్, అతని తర్వాత నెంబర్ 2గా ఉన్న పారామిలిటరీ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల తరబడి తీవ్ర ఉద్రిక్తతల తర్వాత శనివారం సూడాన్‌లో హింస చెలరేగింది. ఖార్టూమ్ లోని ఆర్ఎస్ఎఫ్ స్థావరం దగ్గర తీవ్ర ఘర్షణ హింస చెలరేగింది. ఈ రెండు దళాలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అభివృద్ధిపై చర్చకు మేం రెడీ
అన్నమయ్య జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యల పై స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి….డీఎల్ రవీంద్రా రెడ్డి కి పదవీ రాకపోవడంతోనే జగన్ సతీమణి భారతి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు….దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తురాలు వైఎస్ భారతి…డీఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయంగా మాట్లాడొచ్చు.. డీఎల్ కు వ్యక్తిగత విషయాలు అనవసరం…అభివృధ్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల పై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ భారతి, విజయమ్మ పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం….సిఎం సతీమణి గా ఎంతో మందికి సేవ చేస్తోంది..పత్రికలు, మీడియా ద్వారా పబ్లిసిటీ కోసం డీ ఎల్ మాట్లాడుతున్నారు..మేం మాట్లాడాలనుకుంటే చాలా చెబుతాం..జగన్ మాకు నేర్పించిన సంస్కారం అడ్డు వస్తోంది అన్నారు శ్రీకాంత్ రెడ్డి. మతిస్థిమితం కోల్పోయి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి…డిఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి రావడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న విషయం కూడా మర్చిపోయి డి ఎల్ మాట్లాడుతున్నాడు. డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం జగన్ కుటుంబం పై మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు మతిస్థిమితం భ్రమించింది. మంత్రి పదవి నుండి రెండు సార్లు బర్తరఫ్ అయిన వ్యక్తి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడతాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆర్ కె రోజా. ఎన్టీవీతో మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండపై నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు అని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అవగాహన లేని వ్యక్తి. ప్రతిపక్ష నాయకుడి పై దాడి వెనుక కుట్ర కోణం ఉండకుండా ఎలా ఉంటుంది?మేం పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరకు వెళ్ళి సెల్ఫీ తీసుకుని చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. రుషి కొండ పై ఏడు బ్లాకులకు అనుమతి ఉంటే మేము నాలుగు బ్లాకుల్లో నే పనులు చేపట్టాం. మిగిలిన బ్లాకుల్లో కూడా పనులు చేపడతాం. గీతం యూనివర్సిటీలో లోకేష్ తోడల్లుడి భూములు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడు అని విమర్శించారు మంత్రి రోజా. గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు ఇటీవల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వైరల్ అయ్యాయి. రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా..? లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ఈ ట్వీట్లపై కౌంటర్ వేశారు మంత్రి రోజా.
మాట్రిమోని ఫ్రాడ్.. లగ్జరీ కార్లు, విల్లాలతో ఫోజులు
ఈ మధ్య మాట్రిమోనీ మోసాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. బయట పెద్దలు కుదిర్చే సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయికి మంచి భర్తను తీసుకురావాలని భావిస్తూ ఈ మాట్రిమోనీ వెబ్ సైట్లపై ఆధారపడుతున్నారు. మంచి ఉద్యోగం, ఆస్తులు, కార్లు, విల్లాలు ఉన్న వ్యక్తుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. తమకు దగ్గరి బంధువుల నుంచి వచ్చే అబ్బాయిలను అసలు పట్టించుకోవడమే లేదు. అయితే అయితే తల్లిదండ్రులు, అమ్మాయిల ఆశ ఓ రకంగా చెప్పాలంటే అత్యాశ వారికి శాపంగా మారుతోంది. సాఫ్ట్వేర్ జాబ్, ఆస్తులు, విల్లాలు, కార్లను చూపిస్తూ అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. పెళ్లి తర్వాత విషయం తెలిసిన ఏం చేయలేని పరిస్థితిలో అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇదిలా ఉంటే సేమ్ ఇలాగే ఓ వ్యక్తి ‘‘రిచ్ కిడ్’’గా కలరింగ్ ఇస్తూ లగ్జరీ కార్లు, విల్లాల ఫోటోలు పెడుతూ మాట్రిమోనీలో ఉండే అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. తాజాగా అతడి బాగోతాలు బయటపడ్డాయి. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సైట్ లో ఉండే ‘‘రిచ్ బ్యాచిలర్’’ మహిళలే టార్గెట్ గా లక్షల్లో మోసం చేస్తున్నాడు. ఇలా మోసానికి పాల్పడుతున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీకీ వెళ్లనివ్వను
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ టికెట్ దగ్గర నుంచి తనకు అనేక అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలు చెప్పడం వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ పని అని, మాటలు చెప్తే మూడోసారి కూడా ప్రజలు ఓటు వేస్తారని సీఎం నమ్ముతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న వారిలో ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఛాలెంజ్ చేశారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోనప్పుడు.. మీకు అండగా నేనున్నానని, అందరినీ ఆదుకున్నానని చెప్పారు. అధికార మదంతో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు విర్రవీగే సమయం అయిపోయిందని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని ఎంత హీనంగా చూశారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. తాను మాటల మనిషిని కాదని.. అందరూ ఒకే గూటికి రావాలని తాను అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానని పిలుపునిచ్చారు. తాను మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలిచి.. రామరాజ్యం ఇస్తానని హామీ ఇచ్చారు.
‘దండక డన్ డన్’ పాటెత్తుకున్న ‘నారాయణ అండ్ కో’!
యువ కథానాయకుడు సుధాకర్ కొమాకుల నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ ‘నారాయణ అండ్ కో’ లోని మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘దండక డన్ డన్’ అంటూ సాగే ఇది ఫుల్ పైసా వసూల్ సాంగ్. నాగవంశీ ఈ పాటను క్యాచీ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశాడు. రాహుల్ సిప్లిగంజ్ ఫుల్ ఎనర్జిటిక్ గా దీన్ని పాడాడు. ఈ పాటను పూర్ణ చారి రాశారు. లాటరీ తగిలిన ఆనందంలో ‘నారాయణ అండ్ కో’ కింగ్స్ లా ఫీలవుతూ రాజుల వస్త్రాధారణలో హంగామా చేయడం ఆకట్టుకుంది. ఈ పాటలో సుధాకర్ కొమాకులతో పాటు దేవి ప్రసాద్, ఆమని, దాదాపు ‘నారాయణ అండ్ కో’ అంతా సందడి చేసింది.
పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా నేషనల్ క్రష్…
ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత స్టార్ హీరోయిన్ అయినా నెగటివ్ కామెంట్స్ ని రష్మిక తీసుకున్నంత ఈజీగా, స్పోర్టివ్ గా ఇంకొకరు తీసుకోరు. చాలా లైవ్లీ ఉండే రష్మిక, కెరీర్ లో మొదటిసారి ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ కేటగిరిలో చోటు సంపాదించుకుంది. IMDB ప్రతివారం రిలీజ్ చేసే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో రష్మిక మూడో స్థానంలో నిలిచింది. రష్మిక IMDB పాపులర్ సెలబ్రిటీ లిస్టులోకి ఎంటర్ అవ్వడం ఇదే మొదటిసారి.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇది ఈ సీజన్‌లోని 20వ మ్యాచ్. ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఆర్సీబీ రంగంలోకి దిగింది. హోంగ్రౌండ్ కావడంతో.. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. పరువుకి సంబంధించిన విషయం కాబట్టి.. తప్పకుండా సత్తా చాటాల్సిందేనని ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కసిగా ఉన్నారు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ జట్టు.. రెండు మ్యాచ్‌లు ఓడి, కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. అటు.. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్‌లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో.. ఈ మ్యాచ్‌తోనే ఖాతా తెరవాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్ తిరిగి రాగా.. ఆర్సీబీ జట్టులోకి వనిందు హాసరంగా చేరాడు.