‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం తాలూకూ డిజిటల్ రైట్స్… ఇప్పుడు నెట్ ప్లిక్స్ స్వంతమయ్యాయి. అలాగే, సాటిలైట్ రైట్స్ జీ సంస్థ కొనుగోలు చేసింది. థియేట్రికల్ రైట్స్ రెలయన్స్ ఎంటర్టైన్మెంట్ వద్దే ఉంటాయి. ఆ సంస్థ టీ-సిరీస్ తో కలసి రోహిత్ శెట్టి పిక్చర్స్ తో సంయుక్తంగా ‘సర్కస్’ నిర్మించింది.
రణవీర్ సింగ్ డ్యుయెల్ రోల్ చేస్తోన్న ‘సర్కస్’ 1960ల నాటి క్లాసిక్ కామెడి ఆఫ్ ఎర్రర్స్ స్టోరీ! ఇద్దరు కవలలు పుట్టగానే విడిపోతారు. వారు మళ్లీ ఎదురుపడ్డప్పుడు ఏర్పడే కన్ ఫ్యూజనే ‘సర్కస్’ చిత్రంలోని కథ! అప్పట్లో వచ్చిన ‘అంగూర్’ సినిమా ప్రేరణగా రోహిత్ శెట్టి ‘సర్కస్’ రూపొందించాడు. రణవీర్ తో పాటూ వరుణ్ శర్మ కూడా అతడి ఫ్రెండ్ గా డ్యుయెల్ రోల్ చేయటం మరో విశేషం!
రణవీర్ సింగ్ ‘సర్కస్’తో పాటూ ‘83’ సినిమాలోనూ త్వరలో కనిపించబోతున్నాడు. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సూర్యవంశీ’ కూడా థియేటర్స్ కి రావాల్సి ఉంది. మొత్తం మీద ఎనర్జిటిక్ డ్యుయో రణవీర్, రోహిత్ శెట్టి ఇద్దరూ కలసి తమ మూడు చిత్రాలు… ‘సర్కస్, 83, సూర్యవంశీ’తో ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో… చూడాలి!