Uttam Kumar Reddy complaint to the authority against Revanth Reddy: టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వెంటనే మీడియాకు వివరిస్తారని ఫైర్ అయ్యారు. ఈ విషయం మీడియాలో చూసి ఖంగుతానాల్సి వస్తోందన్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుని మీడియాతో వివరాలు పంచుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీడియాకు వివరిస్తే స్థానిక పార్టీ శ్రేణులను ఎలా ఒప్పించగలరని అన్నారు.
కారణం ఇదే..
ఈ నెల 21న నల్గొండ జిల్లాలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నట్లు రేవంత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సభను విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి జిల్లా నాయకత్వానికి పిలుపునిచ్చారు. అయితే ఈ వార్తతో అదే జిల్లాకు చెందిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యపోయారు. విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఉత్తమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి నచ్చక పార్టీ మారినట్లు ప్రకటించారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీలోని కొందరు నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సంగారెడ్డిలో ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేను ఆహ్వానించగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందలేదు. దీంతో వారి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక తాజాగా రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు టీపీసీసీలో ఎలాంటి పరిణామాల కు దారితీస్తుందనే అంశంపై ఆసక్తి రేపుతుంది.
Patnam Mahender Reddy: బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ