‘ఇందు గలడు అందు లేడని సందేహం వలదు’ అన్న చందంగా దేశవ్యాప్తంగా కోతులు బెడద ప్రతి గ్రామంలో ఉంది. కోతుల బెడదను జనాలు తట్టుకోలేకపోతున్నారు. కోతులు పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా.. ఇళ్లను కూడా పీకి పందిరేస్తున్నాయి. కోతులను తరిమేయలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కోతుల బెడదను నివారించేందుకు కొందరు వినూత్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం వెలుగులోకి వచ్చింది.
Also Read: IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ కోసం ప్రత్యేక నాణెం!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా అయింది. ఊర్లో ఎటు చూసినా కోతులు నానా హంగామా చేశాయి. విద్యార్థులు పాఠశాలలో భోజనం సమయంలో వచ్చి ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణ మోహన్‌కి గ్రామస్థులు తెలిపారు. ఆయన గ్రామ పంచాయతీలో పనిచేసే ఓ కార్మికుడికి ఎలుగుబంటి వేషం వేసి ఊరంతా తిప్పారు. దీంతో కోతులు ఊరికి దూరంగా పారిపోవడం మొదలయ్యాయి. ఇదే విధంగా కొన్ని రోజులు చేశారు. దాంతో స్కూల్ వైపు, గ్రామం వైపు కూడా కోతులు రావడం మానేశాయి. దాంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని అభినందిస్తున్నారు.