సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అంతేకాకుండా స్పెషల్ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. దీంతో ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఎంచుకుని సురక్షితంగా స్వగ్రామాల నుంచి తిరిగి రావొచ్చని సూచించారు. అటు పండక్కి ఊళ్లకు వెళ్లిన వారి కోసం రైల్వేశాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 110 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్నాయి.