కమలాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూం ధాం కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన మంత్రి హరీశ్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ తన బాధను.. మనందరి బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాను రాసుకున్న బురదను.. మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధను మన బాధగా మార్చుకుని ఆగమవుదామా.. మనందరి బాధలు తీర్చే కేసీఆర్ కు అండగా ఉందామా.. ఆలోచించండి అని తెలిపారు.
ఈటల రాజేందర్ కు కేసీఆర్ ఏం తక్కువ చేసాడు. అన్ని అవకాశాలు ఆయనకు ఇచ్చాడు. నా తమ్ముడని, కుడిభుజమని చెప్పి ఈటల గౌరవాన్ని పెంచారు. అలాంటిది కేసీఆర్ తెచ్చిన కల్యాణ పథకాన్ని అవసరం లేదన్నాడు. అది కడుపు నింపదన్నాడు ఆసరా ఫించన్ అన్నం పెట్టదన్నాడు. రైతుబంధు దండుగ అన్నాడు. ఓ మంత్రిగా ఉండి అలా మాట్లాడొచ్చా? ఆసరా ఫించన్ మీకు కావాలా వద్దా అని అడిగారు. ఈటల రాజేందర్ వద్దంటున్నాడు.. మీరే గుణపాఠం చెప్పాలి. ఈటల రాజేందర్ మాత్రం 10.5 లక్షల రైతు బంధు తీసుకుని.. రైతులకు మాత్రం రైతుబంధు వద్దంటున్నాడు అని తెలిపారు. కేసీఆర్ మానవతావాది. పేదప్రజల పక్షపాతి. కానీ కేసీఆర్ కు మానవత్వం లేదని ఈటల మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కు మానవత్వం ఉందో లేదో.. కేసీఆర్ తెచ్చిన పథకాలు అనుభవిస్తున్నవారిని అడుగు. రానీ కరెంట్ కు బిల్లులు వేసినవాళ్లు, నీళ్లు ఇవ్వకుండానే నీటి తీరువా వసూలు చేసిన వాళ్లున్నారు. కానీ ఉచిత కరెంట్ ఇచ్చి, నీటి తీరువా తీసేసి, రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ కు మానవత్వం లేదా అని హరీష్ అన్నారు.
నీవు చేరిన బీజేపీ ఏం చేస్తోంది. బావుల కాడ మీటర్లు పెట్టమంటోంది. మార్కెట్లు రద్దు చేస్తామంటోన్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరాడు. ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు.. తనకు మాత్రం కుర్చీ కావాలంటున్నాడు ఈటల. రాజేందర్ కు కుర్చీ కావాలా? పేద ప్రజల అవసరాలా అని ప్రశ్నించిన హరీష్ రావు… కాంగ్రెస్ కు ఇక్కడ డిపాజిట్ కూడా రాదు అని తెలిపారు. అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగాలు ఊడగొట్టే బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి. పండుగ పూట ధరలు పెంచి పేద ప్రజల ఉసురుపోసుకుంటున్న బీజేపీకి ఓటేయాలా… కన్న కొడుకు చీర కొనీయకపోయినా.. పండగ పూట చీర ఇవ్వాలన్న ఆలోచన చేసింది కేసీఆర్. రాజేందర్ గెలిస్తే ఏం చేస్తడో చెప్పడట. నన్ను చూసి ఓటేయమంటున్నాడు. బీజేపీ దళిత, బలహీన, బడుగుల వ్యతిరేక పార్టీ. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే పార్టీ టీఆర్ఎస్. వడ్డీ లేని రుణాల పంపిణీలో కేంద్ర వాటా రూపాయి కూడా లేదు. ఇటీవలే ఇచ్చాం. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని అడిగారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లోకి రాకముందే హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగిరింది. కమలాపూర్ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా. ఆయన ఉన్నప్పుడైనా.. పోయినా.. ఇక్కడ గెలిచేది టీఆర్ఎస్ పార్టే. ఆయనకు ఇవ్వని పదవిలేదు.. రాని అవకాశం లేదు. ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్పు.. టీఆర్ఎస్ పార్టీ నీకు అన్ని ఇచ్చింది. అన్నీ ఇచ్చిన కేసీఆర్ కు ఘోరీ కడతానన్న నీకు మానవత్వం లేదు. తిన్న రేవును మరిచిపోతారా.. ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నాడు అని పేర్కొన్నారు.