డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. గురువారం వీడియోలో ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన వీడియోలో ప్రత్యర్థి పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. నెలన్నర నుంచే డబ్బు, బూట్లు, బెడ్‌షీట్లు, చీరలు, రేషన్, బంగారం, గొలుసులు బహిరంగంగా పంపిణీ చేసిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ పట్ల వారికి భయంలేదని తెలిపారు. ఈ పంపిణీ అంతా పోలీస్ సంరక్షణలోనే జరిగిందన్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వారికి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకున్న అవినీతి డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరేమీ ఇచ్చినా తీసుకోండి.. అంతేకానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దని కోరారు. వారంతా అవినీతిపరులు, దేశద్రోహులు, దేశ శత్రువులు..అలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు మరియు దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు భిన్నమైనవి అని గుర్తించి ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు.
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు సిద్ధమైన హైడ్రా..
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు అందడంతో.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు హైడ్రా అధికారులు తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ వాళ్లు ఆక్రమించారంటూ వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 152, 153 లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా సర్వే చేపట్టింది. పార్కులు, రహదారులు కబ్జాకు గురి అయినట్టు హైడ్రా నిర్ధారణ వచ్చింది. వెంకటరమణ కాలనీ లోకి చొరబడి గోల్డెన్ కీ వెంచర్స్ ఆక్రమణలకు పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణ వచ్చింది హైడ్రా. ఈ విషయంలో మరింత లోతైన సర్వే చేయించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే జాయింట్ సర్వే చేసేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తోంది.
భారత గణతంత్ర దినోత్సవ వేడుకకు అతిపెద్ద ముస్లిం దేశ అధ్యక్షుడు…
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత్ ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకు ముగ్గురు రాష్ట్రపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నందున ఆయన భారత పర్యటన కూడా ప్రత్యేకంగా మారనున్నారు.
ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్..
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15న నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై భువనేశ్వరి పోలీసులతో చర్చించారు. స్టేడియంలో నిర్మాణం చేసే బ్లాక్‌లు, వీవీఐపీలకు మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు భువనేశ్వరికి వివరించారు. పాస్‌లు ఉన్న వారినే లోపలకు అనుమతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీకి భువనేశ్వరి సూచించారు.
నోయిడాలో అక్రమ పరిహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం
నోయిడా అధికారులు భూ యజమానులకు చెల్లించిన అక్రమ పరిహారం అంశంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ప్రస్తు్తం దర్యాప్తు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీని కాదని ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక సిట్‌ను నియమించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా న్యాయ సలహాదారుడు, న్యాయ అధికారి ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారిస్తూ న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరోపణలు కొంతమంది భూ యజమానులకు అనుకూలంగా భారీ మొత్తంలో పరిహారాన్ని విడుదల చేయడంతో సంబంధం కలిగి ఉన్నాయని, వారు తాము స్వాధీనం చేసుకున్న భూమికి అంత ఎక్కువ పరిహారం పొందే అర్హత లేదని ఆరోపించబడింది. ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లక్నో జోన్) ఎస్ బి శిరాద్కర్, సిబిసిఐడి ఇన్స్పెక్టర్ జనరల్ మోదక్ రాజేష్ డి రావు, యుపి స్పెషల్ రేంజ్ సెక్యూరిటీ బెటాలియన్ కమాండెంట్ హేమంత్ కుటియాల్ లతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
రాజకీయాలకు గుడ్ బై.. సంచలన నిర్ణయం
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ లో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మేడ్చల్‌లో యువతి హత్య.. వెలుగులోకి కీలక విషయాలు
మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు. యువతి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఎవరూ, ఇక్కడకు ఎలా వచ్చిందీ, ఎవరితో వచ్చిందీ తెలుసుకునేందుకు పోలీసులు పరిశోధన ముమ్మరం చేశారు.
20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి..
తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా గడచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిగారు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగు లేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగు లేటి హౌసింగ్ కు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.
విజయసాయి రెడ్డిపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేశారు..
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు. ఆయనతో ఇంకా మాట్లాడలేదు.. వైసీపీలో విజయసాయి రెడ్డి చాలా కీలక నేత అని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన కలలుకన్నారు.. మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారని తెలిపారు.