ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు.. ఢిల్లీ, గురుగ్రామ్‌లో అలర్ట్ !
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తాజాగా సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధానిలో ఐదుగురు బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎర్రకోట ఆవరణలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండే ఈ యువకులు ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసే సమయంలో వారి వద్ద బంగ్లాదేశ్‌కు సంబంధించిన పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు.
మిజోరాం రాజధాని మార్పు? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.!
మిజోరాంలో ఐజ్వాల్‌ను రాష్ట్ర రాజధానిగా మార్చి తెన్జాల్ కు తరలించనున్నారా? అనే అంశంపై తీవ్ర ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై మిజోరం ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు జరగదని ఖచ్చితంగా పేర్కొంది. ఈ వార్తలన్నీ ఓ “క్లరికల్ ఎర్రర్” వల్ల తలెత్తిన తప్పు భావన అని ప్రభుత్వం తెలిపింది. ఈ వివాదానికి అసలు కారణం ఏంటంటే.. ఏప్రిల్ 24న కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ మిజోరాం ప్రభుత్వానికి పంపిన లేఖలో ‘ఐజ్వాల్ నుంచి తెన్జాల్ కు రాజధాని మార్పు’ అన్న విషయంపై DPR (Detailed Project Report) సిద్ధం చేయాలని సూచించడమే. ఇదే లేఖను ఆధారంగా తీసుకుని ప్రతిపక్ష MNF పార్టీ గట్టిగా విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి లాల్దుహోమా మాటలతో రాజధాని మారుస్తున్నారనే ఆరోపణలు MNF ప్రధాన కార్యదర్శి జోడిన్‌పుయా చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది.
చంగూర్ బాబా కేసులో కీలక మలుపు.. ఈడీ కస్టడీలో సహచరుడు.. మతమార్పిడుల కుట్ర వెనుక భారీ నెట్‌వర్క్?
ఉత్తరప్రదేశ్‌ను కుదిపేస్తున్న అక్రమ మతమార్పిడుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంగూర్ బాబా వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. లక్నోలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (PMLA) కోర్టు సోమవారం చంగూర్ బాబాకు సన్నిహితుడిగా భావిస్తున్న నవీన్ రోహ్రాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీకి అప్పగించింది. నవీన్ గతంలో యుపీ ఎటీఎస్ అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈడీ దర్యాప్తు కోసం కోర్టులో కస్టడీ కోరగా, కోర్టు అందుకు ఆమోదించింది. ఇందులో భాగంగా ఈడీ తాజా విచారణ ప్రకారం, చంగూర్ బాబా తన డబ్బులను నేరుగా తన పేరుపై కాకుండా నవీన్ రోహ్రా, అతని భార్య నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్) పేర్లపై ఆస్తులుగా వేసినట్లు గుర్తించారు.
అమిత్ షా సరికొత్త రికార్డ్.. దేశ చరిత్రలో ఆయనకే సొంతం
ప్రధాని మోడీ ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా అమిత్ షా కూడా సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. తాజాగా అమిత్ షా కూడా ఆగస్టు 5తో సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను అమిత్ షా సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎక్కువ కాలం హోంమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా మంగళవారం రికార్డును బద్దలు కొట్టారు. బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ఱ అద్వానీ రికార్డ్‌ను ఆగస్టు 5న అమిత్ షా బద్దలు కొట్టారు. అద్వానీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఆరు సంవత్సరాలకు పైగా హోం మంత్రి పదవిని నిర్వహించారు. మోడీ 1.0 పాలనలో హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఐదు సంవత్సరాలు పని చేశారు. తాజాగా అమిత్ షా.. ఆరు సంవత్సరాల 64 రోజుల పాటు హోంమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే.. నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు.
సృష్టి కేసులో నేటితో ముగియనున్న డాక్టర్ నమ్రత కస్టడీ..
సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేడు ముగియనుంది. కోర్టు ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించగా, గత నాలుగు రోజుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక్కొకరుగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాధితులు బయటకు వస్తున్నారు. నల్గొండకు చెందిన జంట నుంచి రూ.44 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.18 లక్షలు, మరో NRI జంట నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ కేసులో నాలుగు FIRలు నమోదు కాగా, 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నమ్రత బినామీగా వ్యవహరించిన కీలక నిందితురాలు విద్యులతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నమ్రత కుమారుడు జయంత్ కృష్ణతో పాటు మరికొందరు నిందితులను కూడా కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ కంటే పాకిస్థానే ప్రేమిస్తారు.. జయా బచ్చన్‌పై రేఖా గుప్తా ఆగ్రహం
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ వర్సెస్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కౌంటర్‌కు ప్రతికౌంటర్‌తో వాగ్యుద్ధం సాగుతోంది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ నడిచింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడాన్ని జయా బచ్చన్ తీవ్రంగా తప్పుపట్టారు. మహిళలు సిందూరాన్ని కోల్పోయి బాధలో ఉంటే.. ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడమేంటి? అని నిలదీశారు. తాజాగా జయా బచ్చన్ రాజ్యసభలో మాట్లాడిన మాటలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తున్నాయని.. దేశాన్ని ప్రేమించడం కంటే పాకిస్థాన్‌ను ప్రేమిస్తున్నారంటూ ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు.
భారీ భూకంపంతో దెబ్బతిన్న రష్యా అణు సబ్ బేస్!
రష్యాలో గత వారం భారీ భూకంపం బెంబేలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు జారీ అయ్యాయి. ఇక నగరాలు.. నగరాలే ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక పసిఫిక్ సముద్ర తీరంలో భారీ నష్టాన్ని చవిచూసింది.అయితే భూకంపం సందర్భంగా రష్యా అణు సబ్ బేస్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కమ్చట్కా ద్వీపకల్పంలోని రైబాచియ్ జలాంతర్గామి స్థావరంలో తేలియాడే పైర్‌కు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ మేరకు వాణిజ్య ఉపగ్రహ ఇమేజింగ్ సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫొటోల్లో కనిపిస్తున్నట్లుగా ఓ వార్తాపత్రిక నివేదించింది. ఓడరేవులోని ఒక భాగం దాని యాంకర్ పాయింట్ నుంచి విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఓడరేవు కూడా భారీగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. అంతే తప్ప పెద్ద విధ్వంసం జరిగినట్లుగా కనిపించలేదు. అయితే దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
ఓవల్ టెస్ట్ విజయం.. భారత్ సరికొత్త రికార్డ్!
భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో భారత్ ఈ ఫీట్ సాధించింది. 2004లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు భారత్ లోయెస్ట్ మార్జిన్ విజయం ఇదే. ఓవల్ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో 21 ఏళ్ల రికార్డ్‌ను టీమిండియా తిరిగరాసింది.
1972లో ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2018లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ మైదానంలో 31 రన్స్ తేడాతో గెలుపొందింది. తాజాగా టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు ఇది నాలుగో లోయెస్ట్ మార్జిన్ ఓటమి. అంతకుముందు న్యూజిలాండ్ (1 రన్, వెల్లింగ్టన్-2023), ఆస్ట్రేలియా (3 రన్స్, మాంచెస్టర్-1902), ఆస్ట్రేలియా (6 రన్స్, సిడ్నీ-1885)పై తక్కువ పరుగుల తేడాతో ఓడింది.