నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు..?
నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన హత్యాయత్నం ఘటనలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో జరిగింది ఒక మారణఖండగా చెప్పవచ్చు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. ప్రమాదం అని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. కాబట్టి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారు?.. వారి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. బాధితులకు మేము అండగా ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. పోలీసులపై దాడి
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో శనివారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. చంద్రయాన్ గుట్ట ఏరియాలోని ASIపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే ముప్పతిప్పలు పడేలా ఆ గంజాయి బ్యాచ్ ప్రవర్తించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ వారు రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
హ్యాపీ దీపావళి.. నయా నరకాసురులను ఎన్నికల్లో ప్రజలు ఓడించారు..
తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీప కాంతులతో శోభాయమానంగా.. సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి.. మన భారతదేశంలో చేసుకునే ప్రతీ పండుగకి ఒక పరమార్థం ఉంది.. మనకు జీవన శైలిని నేర్పుతుంది.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటామని తెలియజేశారు. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలి
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులు లాభపడే విధంగా పాలన సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు సర్టిఫికెట్లు, లైసెన్సులు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ కాదు.. పండగ కావాలన్నారు. రైతు లాభపడాలి.. రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యుడికి అన్యాయం చేసినట్టే అవుతుంది అని అన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక మలుపు
తెలంగాణలో సంచలనం రేపిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యకు ప్రధాన నిందితుడైన షేక్ రియాజ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. సారంగాపూర్ సమీపంలో రియాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పోలీసులు రియాజ్ వివరాలను సేకరించగా.. అతని నేర చరిత్ర చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన రియాజ్‌పై ఇప్పటికే 40కి పైగా కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రియాజ్.. యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచి నేరజీవితాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సిద్ధం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసులో తన పేరును చేర్చడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్ విసిరారు.
మహిళలు అడుగుతున్నారు.. జర అదొక్కటి చేయండి సీఎం గారు!
‘మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరైన సందర్భంగా వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సమోస కొన్న తర్వాత ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఫెయిల్.. కాలర్ పట్టుకుని ప్యాసింజర్ ను ఘోరంగా..!
నేటి డిజిటల్ యుగంలో క్షణాల్లో సమాచారాన్ని ప్రపంచానికి చేరవేయడంలో సోషల్ మీడియా, వైరల్ వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక అన్యాయాలు, ఆసక్తికరమైన సంఘటనలు, ప్రజల ప్రవర్తనలోని మంచి చెడులను ఈ వీడియోలు బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో.. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. డిజిటల్ పేమెంట్ విఫలమవడంతో మధ్యప్రదేశ్ జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడిపై సమోసా విక్రేత ఘోరంగా దాడి చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 17 (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జబల్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 5 పై ఈ సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సమోసా కొనుగోలు చేయడానికి రైలు దిగాడు. డబ్బులు చెల్లించేందుకు ఫోన్‌పే (PhonePe) యాప్ ద్వారా ప్రయత్నించగా, ట్రాన్సాక్షన్ విఫలమైంది.
తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై హోంమంత్రిని నివేదిక కోరిన సీఎం..
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడులో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్యపై సీఎం చంద్రబాబు హోంమంత్రిని నివేదిక కోరారు. కూటమి నేతలతో కలిసి రాళ్లపాడు వెళ్లి ఘటనపై నివేదిక ఇవ్వాలని హోం మంత్రి అనితను ఆదేశించారు. తన సోదరులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న లక్ష్మీనాయుడును కొద్దిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిచంద్రప్రసాద్ కారుతో గుద్ది చంపాడు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.. ఘటనపై రాజకీయంగా దూమారం లేవడంతో మరింత లోతుగా విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన, బీజేపీ నేతలతో కలిసి బాధిత కుటుంబ వద్దకు వెళ్లాలని సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితకు ఆదేశించారు.
గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం!
గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటీషర్ల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. మూడు తరాలుగా దేశం కోసం గాంధీ కుటుంబం పనిచేస్తోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారిని తిప్పికొట్టాలన్నారు. బీసీ కులగణన చేసి వందేళ్ల సమస్యకు పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాంధీ అనే పదం ఈ దేశానికి పర్యాయ పదం. అన్ని మతాల సహజీవనం ఎలా స్పూర్తి ఇస్తుందో.. గాంధీ అనే పదం కూడా అదే స్పూర్తినిస్తుంది. గాంధీని బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని రోజుల్లోనే మతతత్వ వాదులు గాంధీని హత్య చేశారు. బ్రిటిషర్ల కంటే మతతత్వ వాదులు ప్రమాదకరం అని గుర్తు పెట్టుకోవాలి. దేశం కోసం మొదటి తరం గాంధీ.. రెండో తరం ఇందిరా గాంధీ.. మూడో తరం రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.