Tummala Nageswara Rao sensational comments on the elections: తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీకి ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరడం దాదాపుగా ఖాయం అయింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వరంగల్ టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. ఆయన కూడా బీజేపీలో చేరుతున్నారనే సమచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడటం మింగుడుపటడం లేదు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బస్వరాజు సారయ్య రంగంలోకి దిగారు. ఇలాంటి రాజకీయ పరిణామాల మధ్య తుమ్మల నాగేశ్వర రావు బాంబు పేల్చారు. సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు తావిచ్చారు.
ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని.. కార్యకర్తలు, నేతలు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ఎప్పుడు రావచ్చని కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు వ్యూహాత్మకంగా, ప్రణాళిక పరంగా సిద్ధంగా ఉండాలని సూచించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
రానున్న ఎన్నికల్లో ఖమ్మం ప్రాంతంలో తన సత్తా చాటాలని తుమ్మల భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కందాల ఉపేందర్ రెడ్డి వైపు కొంత మంది తుమ్మల వైపు కొందరు కార్యకర్తలు ఉన్నారు. దీంతో తన వైపు కార్యకర్తలను తిప్పుకునే ప్రయత్నంలో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా.. అందరికి అందుబాటులో ఉన్నాననే సంకేతాలు ఇచ్చేలా తుమ్మల నాగేశ్వర రావు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.