తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆ పార్టీల్లో పలువురు నేతల్ని బీజేపీ ఈమ పార్టీలో కి చేర్చుకోవాలని భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసుకునే యోచనలో బీజేపీ ఉంది. దీనిపై ఆపార్టీ నాయకులే .. మేం నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడతామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన విషయం తెల్సిందే..
తాజాగా బీజేపీలోకి క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ ఇద్దరూ చేరనున్నారు. విఠల్ తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా, కో-ఛైర్మన్‌గా ఆయన ఉద్యమ సమయంలో పనిచేశారు. రాష్ర్ట ఆవిర్భావం అనంతరం టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగాను పనిచేశారు. కాగా నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ అధిష్టానాన్ని కలిశారు. నేడు విఠల్ బీజేపీలోకి చేరుతుండగా.. రేపు తీన్మార్ మల్లన్న కాషాయ కండువా కప్పుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంతా సిద్ధం అయింది. తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కేసులు పెట్టిన సందర్భంలో అతనికి బీజేపీ పార్టీ అండగా నిలిచింది. మరోవైపు విఠల్ తో చర్చలు జరిపి కాషాయ కండువా కప్పుకునేలా ఒప్పించారు పార్టీ నాయకులు.