నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. పోలీసుల పైకి రాళ్లు రువ్వడం.. పరిస్థితి విషమించడంతో టీయర్ గ్యాస్‌ను పోలీసులు ప్రయోగించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్… ప్రత్యేక బలగాలు రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఆందోలనకారులను పోలీసులు చెదరగొడుతున్నారు. ఆందోళనకారులు నిరసన నిలిపివేయాలని ఒక గంట సమయం ఇచ్చినా.. పట్టించుకోకపోవడం, రాళ్లు రువ్వడంతో టీయర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బోధన్‌లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.