ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటున్న యుద్ధ పరిస్థితులతో అక్కడికి చదువుకునేందుకు వెళ్లిన తెలంగాణ యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్లారు. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ అజయ్ కుమార్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం ఎంబీబీఎస్ చదివేందుకు అజయ్ కుమార్ ఉక్రెయిన్ వెళ్లాడు. మరో మూడు నెలలు అయితే అజయ్ కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చే వాడు. ఇంత లోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అజయ్ కుమార్ పేరెంట్స్ భయాందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్ లో ఉన్న తమ కొడుకును సురక్షితంగా ఇక్కడికి తీసుకొనిరావాలంటున్న అజయ్ కుమార్ తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత కోరుతున్నారు. బాలస్వామి పెద్దకుమారుడు పెరుమాళ్ళ ప్రణయ్ కుమార్ మూడేళ్ళ క్రితం హత్యగావించబడగా, చిన్న కుమారుడు అజయ్ కుమార్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. తమ కొడుకు తోపాటు ఉక్రెయిన్ లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకుని రావాలంటున్నా అజయ్ కుమార్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లా భోధన్‌కు చెందిన నరేందర్, సంధ్యా రాణిలకు ఇద్దరు కొడుకులు. అయితే వీరిలో పెద్దకొడుకు ముప్పారాజు వినయ్ ఎంబీబీఎస్ చదువు కోసం 2019లో ఉక్రెయిన్ కు వెళ్లాడు. వినయ్ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. వీరితో పాటు యాదగిరిగుట్టకు చెందిన గంజి భానుప్రసాద్, ముదంబై శేషఫణిచంద్ర అనే యువకులు మెడిసిన్ చేయడం కోసం మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లారు. ఇండియా రావడం కోసం కీవ్ ఎయిర్‌పోర్ట్ కు విద్యార్థులు వచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్ ను తమ ఆధీనంలోకి రష్యా సైనికులు తీసుకోవడంతో.. జాఫ్రోజీ కాలేజీకి విద్యార్థులు వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల్లో తల్లిదండ్రలు తమ పిల్లలను త్వరగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.