Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యే సీట్లను ఓట్లను పెంచుకోగలిగింది. తామే బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం అని కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు చెప్పిన బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సైలెంట్ అయింది. మరోవైపు కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచింది. అయితే గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానంలోనే గెలుపొందిన బీజేపీ, ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది.
Read Also: Telangana Results: బాల్క సుమన్, గాదరి కిషోర్, గువ్వల బాలరాజు .. ఓటమిపాలైన విద్యార్థి నాయకులు..
అయితే కీలక నేతలు మాత్రం ఓటమి పాలయ్యారు. బీజేపీ ఎంపీలుగా ఉన్న ముగ్గురు నేతలు ఓటమి చెందారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. వీరు ముగ్గురు వరసగా కోరుట్ల, కరీంనగర్, బోథ్ అసెంబ్లీ నియోజవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో పాటు కీలక నేతలుగా ఉన్న ఈటెల రాజేందర్, రఘునందన్ రావు కూడా ఓడిపోవడం బీజేపీకి మింగుడుపడటం లేదు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు మాత్రం ఎమ్మెల్యేలుగా ఘనవిజయం సాధించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి, భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.