వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో 10 కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి.. కానీ, ఆదివాసులకు ఇస్తామన్న పోడు భూములకు పట్టాలు రాలేదన్నారు. ఆదివాసులవి గొంతెమ్మ కోరికలు కావన్న ఆయన.. అసలు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.. కేసీఆర్ ఆదివాసుల హక్కులను కాపాడతామని చెప్పారు. కానీ, కేసులు పెట్టి జైళ్లకు పంపారని మండిపడ్డారు.. చంటి పిల్లలను కూడా జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం.. దున్నేవారికి పట్టాలు ఇస్తా అని మోసం చేశారన్నారు..
ఆదివాసులు భూమిని నమ్ముకుంటున్నారు.. అమ్ముకోవడం లేదు.. కానీ, అధికారులతో పాశవిక దాడులు చేయిస్తోంది ప్రభుత్వం అని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.. ఆదివాసులంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ పదే పదే హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని.. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వమే భూములు లాక్కుని అమ్ముతుందన్నారు.. ప్రజల సొమ్మును ప్రభుత్వం కొల్ల గొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2018లో కొందరు పార్టీని మోం చేశారు.. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్న ఆయన.. ఆదివాసుల హక్కుల కోసం కాంగ్రెస్ కొట్లాడుతుంది.. కేసీఆర్ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక్క కలం పోటుతో కేసులు కొట్టేస్తామని.. ఆదివాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కేసులకు భయపడకండి అని సూచించారు..
ఇక, దొరల ప్రభుత్వం పోవాలి.. పేదల ప్రభుత్వం రావాలన్న రేవంత్‌రెడ్డి.. పేదల ప్రభుత్వమే సోనియమ్మ రాజ్యం అన్నారు.. త్వరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఇప్పటికే ఈ విషయంలో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్కతో మాట్లాడానని తెలిపారు.. వారు ఢిల్లీలో ఉన్నారు.. వచ్చిన తర్వాత మాట్లాడి సభ తేదీ ప్రకటిస్తామని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.