కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మాకు ఎక్కడా పోటీ కాదు.. రారు.. అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు ఎర్రబెల్లి… రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన సొంత ఇమేజ్ కోసమే ప్రయత్నం చేస్తారని ఎద్దేవా చేశారు.. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు అని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసమే పని చేస్తున్నారని సెటైర్లు వేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరోవైపు, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి… బీజేపీ నేతలు మూర్ఖులు అంటూ మండిపడ్డారు.. వాళ్లు (భారతీయ జనతా పార్టీ) ప్రాంతీయ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.. మహారాష్ట్రలో కూడా అదే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.. శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం కొనసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తాను రాజీనామాకు సిద్ధం అని కూడా ప్రకటించారు సీఎం ఉద్దవ్ థాక్రే.