టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టు చెబుతోందని జేడీ ప్రస్తావించారు.
Read Also: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో టోనీ ప్రధాన అనుచరుడు
అయితే తమ దగ్గర ఉన్న సమాచారం ఈడీకి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ వాదించారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్‌లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశించిన హైకోర్టు.. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని తెలిపింది. వివరాలు ఇవ్వకపోతే తమను సంప్రదించవచ్చంటూ ఈడీకి హైకోర్టు సూచించింది.