తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో RT-PCR పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. RT-PCR, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
కాగా ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు కూడా భారీ స్థాయిలో పెరిగింది. గతంలో రోజుకు కేవలం 10 వేల లోపే ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలను దాటింది. మరోవైపు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో వెయ్యి లోపలే ఉండే కేసులు ప్రస్తుతం 2,500 దాటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ ఈరోజు మధ్యాహ్నం సమావేశమై…. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలు విధించే అవకాశాలపై సమీక్షించనుంది.