ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి రానున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు విడుదల కాగా, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఐతే తాజాగా రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని తుది జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది సీసీఎల్ఎ. 63 లక్షల 25 వేల 695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల ఎకరాలకు రూ.7508.78 కోట్లు అవసరమవుతాయని..గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది రైతులు పెరగగా, నూతనంగా 66 వేల 311 ఎకరాలు చేరాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 15 నుండి 25 వరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమచేయబడతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది.