తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక దూకుడును పెంచారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నా, ఆ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది.
Read: పాత్రల్లో పరకాయప్రవేశం చేసే గుమ్మడి!
రాష్ట్రంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసేందుకు సిద్ధం అవుతున్నది. అదేవిధంగా, గత కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసేందుకు సిద్ధం అయింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేసేందుకు ప్రణాళికలు వేస్తున్నది. కొత్త అధ్యక్షుడి సారధ్యంలో పార్టీ మునుపటిలా రాణిస్తుందా చూడాలి.