KTR : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందిస్తామన్న కాంగ్రెస్ హామీ దూరమైనప్పటికీ, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ తన విమర్శలను మరింత ఉధృతం చేస్తూ, కాంగ్రెస్ పాలన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆరోపించారు. వృద్ధులకు పెన్షన్లు పెంచకుండా, మహిళలకు నెలకు రూ.2,500 అందజేయకుండా, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వకుండా, రైతులకు పెట్టుబడి సాయం అందించకుండా, రుణమాఫీ ప్రస్తావించకుండా వ్యవసాయ కార్మికులను సమస్యల్లోకి నెట్టారని విమర్శించారు.
అలాగే, గౌడన్నలకు మద్యం దుకాణాల్లో 25% రిజర్వేషన్లు కల్పించకుండా, గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రె పంపిణీ నిలిపివేయడం, దళితులకు రూ.12 లక్షల దళితబంధు పథకం అమలు చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ సర్కార్ లక్షలాది మంది ప్రజలను దగా చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పాలన, ప్రజలకు కరోనా కంటే ప్రమాదకరమని తేలిపోయిందని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
Trump-Zelensky: జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్.. తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్-రష్యా అంగీకారం!