తెలంగాణలో భయానక వాతావరణం నెలకొందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ముఖ్యమంత్రి, మంత్రులు మీ ఆఫీసులకు ఎప్పుడు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్ అయిందని.. లా అండ్ ఆర్డర్, పరిపాలనలో, హామీల అమలులో విఫలం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రూ.109 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బులను తెలంగాణ ప్రజల కోసం స్కూళ్లు, రోడ్లు, దళిత బంధు పథకంలో ఉపయోగపడుతుందని కానీ.. ముఖ్యమంత్రి తన ముఖం చూపించుకోవడాని ప్రకటనలకు ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఫార్మ్ హౌజ్ అధికారిక కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. తెలంగాణలో రక్షకుడు, భక్షకుడిగా మారారని విమర్శించారు. కేసీఆర్ ఆఫీసులకు వెళ్లడని, హోమ్ మినిస్టర్ ఉన్నాడా..? లేదా..? అని ప్రశ్నించారు. సీఎం ఫార్మ్ హౌజ్ లో, సీఎం కొడుకు ట్విట్టర్ లో, హోం మంత్రి సెలవులో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు మీ దగ్గర సమయం లేదా..? అని ప్రశ్నించారు. మీ పోలీసులు నిందుతులకు సహాయం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
కేసును సీబీఐకి అప్పగిస్తే నిందితులెవరో తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగానలో జంగిల్ రాజ్ నడుస్తుందని.. న్యాయ వ్యవస్థకు స్థానం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో మహిళలు సురక్షితంగా లేరని ఆరోపించారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన అన్నారు. ఘటన జరిగిన ప్రభుత్వంలో చలనం లేదని.. అసమర్థ ప్రభుత్వం అని.. కుటుంబ రాజకీయాల్లో మునిగిపోయిందని విమర్శించారు.