ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి విద్యాలయాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
దేశంలో మొదటిసారిగా ఆన్ లైన్ క్లాసులు సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. పాఠశాలలకు వచ్చే పిల్లలకు స్వాగతం చెప్పారు సబితా ఇంద్రారెడ్డి. ప్రత్యక్ష బోధనకు, ఆన్ లైన్ బోధనకు చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, కస్తూర్భా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కలుపుకుని మొత్తం 60-65 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రాబోతున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
మన ఊరు మనబడి కింద 9 వేల స్కూళ్లను మంజూరు చేసుకున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం మొదలు పెడుతున్నామని అన్నారు. ఒకటో తరగతి నుంచి 8 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని.. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని జాయిన్ చేయాలని కోరారు. ఇప్పటికే అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పుస్తకాలను ముద్రించామని ఆమె వెల్లడించారు. తాగునీరు, సానిటేషన్ మొదలైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఓ పండగ వాతావరణంలాగా పాఠశాలను ప్రారంభించాలని సూచించారు.