గడచిన మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణ మృదంగం మోగుతుందని అధికారికంగానే నిత్యం ఐదు నుంచి పది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా, మరో వైపు మిర్చీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, నెలల తరబడి ధాన్యం కుప్పలపై పడిగాపులు కాస్తోన్న రైతు హఠాత్తుగా శవమై కనిపిస్తోన్న దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే… తాజాగా మిర్చీ రైతుల మెడలకు బిగుసుకుంటోన్న ఉరితాళ్లు కలవరపెడుతున్నాయని, రైతుల ఆత్మహత్యలకు పరిష్కారాలు చూపాల్సిన మీ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు.
ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ ఏడాది రైతులు 3,58,557 ఎకరాల్లో మిర్చీ పంట వేశారు. ఎకరానికి రూ. లక్ష వరకు పెట్టుబడులు పెట్టి మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. తారమ పురుగు, రసం పీల్చే పురుగు, ఎండు తెగులు, కాయకుళ్లు తెగులు లాంటివి సోకి పెద్ద ఎత్తున పంట నాశనమైందని పేర్కొన్నారు. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చీ కేవలం ఐదు క్వింటాళ్లు రావడం గగనంగా మారిందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ఇటీవల కాలంలో మిర్చీ రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యం గా మారాయి. సగటున ఒక్కో మిర్చి రైతు నెత్తిన ఐదు నుంచి 10 లక్షల రూపాయల అప్పు ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యాన్ని పరిశీలిస్తే… పంట నష్టం, అప్పు తీర్చలేకపోవడమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Read Also:విపక్షాలు అభివృద్ధిని తరిమేయడానికి పనిచేశాయి: ప్రధాని మోడీ
మీ ఏడున్నరేళ్ల పాలనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెజార్టీ రైతులకు పరిహారం కూడా అందలేదు. ప్రాణాలు కోల్పోయి విషాదంలో ఉన్న రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీ పాలనలో ఉంది. ఇప్పటికైనా మిర్చి రైతుల ఆత్మహత్యలపై దృష్టి సారించండి. తక్షణం మంత్రుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి, వారిలో భరోసా నింపేలా కార్యచరణను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.
రైతుల డిమాండ్లను నేరవేర్చాలి
పంట నష్టపోయిన మిర్చీ రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలి.తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలి.ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. మిర్చి రైతుల్లో భరోసా నింపేందుకు తక్షణం మంత్రుల బృందం క్షేత్రానికి వెళ్లాలి.రూ. లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.