Revanth Reddy Comments On PM Narendra Modi Over Sonia Gandhi ED Interrogation: తల్లి లాంటి సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచి ఘోరంగా అవమానించారంటూ ప్రధాని నరేంద్రమోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐలు తమ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు. మోదీకి రాక్షస ఆనందం ఉండొచ్చని, కానీ అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని విమర్శించారు.
ఏ దేశంలో అయితే మహిళలు అవమానానికి గురవుతారో, ఆ దేశానికి మంచిది కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోదీని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీతో పాటు ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తెచ్చారన్నారు. దోచుకున్న దొంగల ఆట కట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆమె తీసుకొచ్చారన్నారు. మన తల్లిని ఎవరైనా అవమానించే పని చేస్తే.. తలనరికే వరకూ ఊరికే ఉంటామా? అంటూ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీకి అవమానం అంటే.. భారతమాతకు, తెలంగాణ తల్లికి అవమానం జరిగినట్టేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని గురువారం ఎన్స్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మూడు గంటలపాటు ప్రశ్నించింది. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. పలు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రేవంత్ రెడ్డి కూడా మండిపడుతూ.. బీజేపీ బెదిరింపులకు తాము భయపడేదే లేదని తేల్చి చెప్తూ, పై విధంగా స్పందించారు.