కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీల్లో 10 గ్రామాల్లో పది తెలంగాణకు చెందినవే అని టీఆర్ఎస్ పార్టీ ఛాతీలు కొట్టుకుంటున్నారని.. ప్లీనరీతో మొదలు పెడితే ఎక్కడ పడితే అక్కడ టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీ పనిచేసిన చోట ఒక్క అవార్డు కూడా రాలేదని… 10 పంచాయతీలు ఒక కాంగ్రెస్ ఎంపీ, ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలోనే ఉన్నాయని అన్నారు. ఇది మీ టీఆర్ఎస్ పార్టీ నేతల పనితీరు, మీ నాయకుల కమిషన్, కక్కుర్తి విధాానాలకు దర్పణం అని విమర్శించారు.
మీరు దత్తత తీసుకున్న నాలుగు ఊర్లకు వెళ్దామని… ఎవరినైనా పంపాలని, అయితే సీఎం కేసీఆర్ కు అంత సమయం లేదని, ఫామ్ హౌజ్, గెస్ట్ హౌజ్ అంటూ ఉంటారని విమర్శించారు. మీరు ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేరని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు వాసాలమర్రికి వెళ్లారని… ఇళ్లు కూలగొట్టి ఫామ్ హౌజుకు వెళ్లేందుకు రోడ్లు వెడల్పు చేయించుకున్నారని విమర్శించారు. సీఎం దత్తత గ్రామాలు ముల్కనూర్, ఎర్రవళ్లి, నర్సన్న పేట, వాసాలమర్రిలో ప్రభుత్వం చేసిందేం లేదని అన్నారు.
కేసీఆర్ ఫార్మ్ హౌజ్లో కుంభకర్ణుడిగా నిద్రపోయి వచ్చి కేంద్రం ఏదో చట్టాలు మార్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు రఘునందన్ రావు. భారత దేశాన్ని కాదు తెలంగాణని చూసి పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ అంటున్నారని.. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. తండ్రి కొడుకులకు ఎండ దెబ్బ ఏమన్నా తాకిందా.. అంటూ ఎద్దేవా చేశారు. పంచాయతీల్లో జరిగే ప్రతీ పనికి కేంద్రమే నిధులు ఇస్తోందని… కేంద్రం నేరుగా పైసలు ఇవ్వం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటని రఘునందన్ రావు కేసీఆర్ ను ప్రశ్నించారు.