Police Arrested Playing Cards Gang In Film Nagar: హైదరాబాద్ ఫిలింనగర్‌లో పేకాట రాయుళ్లకు టాస్క్‌ఫోర్స్ అధికారులు షాకిచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా ఆడుకుంటున్న తమని ఎవ్వరూ పట్టుకోలేరన్న ధీమాతో ఉండగా.. ‘మేం వచ్చేశాం’ అంటూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ట్విస్ట్ ఇచ్చింది. ఇంకేముంది.. అడ్డంగా దొరికిపోయారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ పేకాట వ్యవహారం నడిచింది భీమవరం మాజీ ఎమ్మెల్సీ నేతృత్వంలో! అందుకే.. పోలీసులు సీరియస్‌గా తీసుకొని, దాడులు నిర్వహించారు. మొత్తం 10 మంది వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకొని, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ వ్యాపారవేత్తలంతా భీమవరంకు చెందినవారేనని తేలింది. ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో మాజీ ఎమ్మెల్సీ నేతృత్వంలో వాళ్లంతా పేకాట ఆడుతున్నారని సమాచారం అందగా.. దాన్ని రూఢీ చేసుకున్న తర్వాత టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 19 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడి చేసిన ఇల్లు.. రోడ్ నం. 5లోని చైతన్య రాజుకు చెందినదిగా గుర్తించారు. పేకాట రాయుళ్ల పేర్లు.. శ్రీహరి, నరేశ్ అగర్వాల్, రవి, పాండురంగరాజు, రవివర్మ, వెంకటరాజు, తమ్మిరాజు, మహేంద్ర, సుభాష్ నాయుడు, ప్రసాద్ కుమార్. వీరితో పాటు వాచ్‌మ్యాన్ శేఖర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు.