సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. నిన్నామొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌తో కోట్ల కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు రూట్ మార్చారు. న్యూడ్ కాల్స్ పేరుతో సామాన్యుల్నే కాదు.. ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. వాళ్లను కూడా ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేసి బెదిరింపులకు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను నియోజకవర్గానికి అంతటికి పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అందుకు ఎమ్మెల్యే ససేమిరా అనడంతో కేటుగాళ్లు అన్నంత పని చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు న్యూడ్ కాల్ రికార్డింగ్‌ను పంపించారు. ఆ విషయం కాస్త.. ఎమ్మెల్యేకు కార్యకర్తలు ఫోన్ చేసి చెప్పడంతో ఖంగుతిన్నారు.
అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. తన అనుచరులతో ఉండగా ఒక వీడియో కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగా.. న్యూడ్ కాల్ అని తెలిసి వెంటనే కట్ చేశారు. వెంటనే కాల్ కట్ చేసినా.. అప్పటికే స్ర్కీన్ రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఎమ్మెల్యేకే పంపించి భారీగా నగదు డిమాండ్ చేశారు. అందుకు వేముల వీరేశం స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. వీడియో రికార్డింగ్ కాంగ్రెస్ లీడర్లకు పంపిస్తామని.. ఇక మీ ఇష్టం అంటూ కేటుగాళ్లు హెచ్చరించారు. అన్నట్టుగానే వీడియో రికార్డ్‌ను ఆయన అనుచరులకు పంపించారు. ఖంగుతిన్న ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిందని యువతిని చంపి యువకుడు ఆత్మహత్య
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకి కూడా ఇటువంటి న్యూడ్ కాల్ వచ్చింది. డబ్బు ఇవ్వకపోతే.. వీడియో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి పోలీసులను ఆశ్రయించారు. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు అదే అనుభవం ఎదురైంది.
ఇది కూడా చదవండి: AP Assembly 2025: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన!