మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నా అని, తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించాను అని స్పీకర్ తెలిపారు.
బుధవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ‘ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కోర్టుకు కూడా వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది. అభియోగాలు, బెదిరింపులతో జూన్‌లో జగన్ నాకు లేఖ రాశారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది వాస్తవం కాదు. నాడు లోక్‌సభలో టీడీపీ గ్రూపు నేత నాయకుడిగా మాత్రమే గుర్తించారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపైన వైసీపీ అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో ఉంది. ఎలాంటి వారి పైన అయినా అసత్యాలు ప్రచారం చేయటం వారి ఆనవాయితీ. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
‘అసెంబ్లీలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. సీఎం హోదాలో నాడు వైఎస్ జగన్ 18 సీట్లు కూడా లేకుండా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పారు. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవటం మాజీ సీఎంగా సరికాదు. ఇది సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుంది. సంధి ప్రేలాపనలుగా పరిగణించి సభాపతి హోదాలో క్షమిస్తున్నాం. ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు?. ఇవన్నీ గ్రహించి అసెంబ్లీకి రావాలని వైసీపీ సభ్యులను కోరుతున్నా’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.