పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో ఏఐసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కరెంటు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా లేక కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని చాలా మంది రైతులు యాసంగి పంట పండించని వారికి ఎకారనికి పది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీని ఒప్పించి మెప్పించి వరిధాన్యం కొనుగోలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, మంథని ప్రాంతంలో మూడు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు.