రైతుల సౌకర్యార్థం అవకాశం ఉన్న ప్రతి చోట వ్యవసాయ మార్కెట్ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మదు మదుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ లు పాల్గొన్నారు. సభలో నిరంజన్ రెడ్డడి మాట్లాడుతూ… ఇక్కడ మార్కెట్ నిర్మాణంతో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు ఉంటాయని, యాసంగిలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ లకు రిజర్వేషన్ కల్పించిందని, మద్దులపల్లి మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్న మార్కెట్‌లను ఆధునీకరిస్తూ.. కొత్త మార్కెట్‌లను ఏర్పాటు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ లోకంలో ఏమీ లేకున్నా నడుస్తది కానీ వ్యవసాయం లేకుంటే నడవదు అని ఆయన వ్యాఖ్యానించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం కుదేలైందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయం వృద్ధిలోకి వచ్చిందని, భాద్యత లేని రాజకీయ పార్టీలు అనేక రకాలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయం భారతదేశంలో మొదటి వరుసలో ఉందని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. రైతు బీమా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదని, మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు.