ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్‌లో జరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రామాల, మండలాలు, జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ నాయకులు భారీ సంఖ్యలో నగరానికి చేరుకుంటారని, అంతేకాకుండా ప్లీనరీ వేడుకల దృష్ట్యా నగవాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండో దశ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది.
పాదయాత్ర బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులకు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగి కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. బండి సంజయ్ పక్కనే ఉన్న కర్ణాటక సరిహద్దులోని రాయచర్‌కు వెళ్లిరావాలని, అవసరమైతే ఏసీ కార్లను ఏర్పాటు చేస్తామన్నారు.
అక్కడికి వెళ్లి బీజేపీ పాలన గురించి, రాయచూర్ ఎమ్మెల్యేను అడిగి తెలుసుకోవాలన్నారు. రాయచూర్ ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు రాయచూర్‌ను తెలంగాణలో కలపాలన్నారని గుర్తు చేశారు. అక్కడికి వెళ్లి చూసొచ్చి సిగ్గు తెచ్చుకోవాలని బండి సంజయ్‌పై కేటీఆర్ మండిపడ్డారు. నీ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకేం లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.