బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో గత రెండు రోజులగా హైదరాబాద్ నగరం బీజేపీ జెండాలతో కాషాయమయంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యారు. అయితే గత మోడీతో బీజేపీ అధిష్టానం మొత్తం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు పలు ప్రశ్నలు గుప్పించారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు. అయితే అలాంటిదేమి లేకుండా సభ నిర్వహించారు బీజేపీ శ్రేణులు. దీనిపై తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ.. ఆయా రామ్ – గాయ రామ్ లతో తెలంగాణకు ఒరిగేదేమి లేదంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇలాంటి పది సభలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, పదే పదే రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ తెలంగాణపై విషం కక్కుతోంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు.
బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని, నీళ్లు, నిధులు, నియామకాల గురించి పదే పదే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పలేదని, తెలంగాణ అభివృద్దికి ఏం చేస్తారో చెప్పకుండా బీజేపీ స్వంత డప్పుకొట్టుకుందని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.