ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖా ముఖి నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు తీర్చి ఇదే విధంగా రాష్ట్రం అంత చేద్దాం అని ఆలోచన ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి వచ్చాక గజ్వెల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ములుగు తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. ధరణి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం అన్నారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారని పేర్కొన్నారు. నిజమైన భూ యజమానులకు భూమిపై పూర్తి హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశ్యమని అన్నారు.
ధరణి పోర్టల్ ఇప్పటి వరకు 7 కోట్ల మంది ఉపయోగించుకున్నారు. భూముల అమ్మకాలు కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ధరణి రిజిస్ట్రేషన్లు 15 నిమిషాల్లో పూర్తవుతున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ లో ఎలాంటి సమస్య లేదని, సాంకేతిక సమస్యలే కొన్ని ఉన్నాయని తెలిపారు. ధరణిలో కొత్తగా మరో 33 మ్యాడ్యూల్స్ చేర్చాము, వీటి ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వంద శాతం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుండి ఈ కార్యక్రమాన్ని పైలట్ గా ప్రారంభించామని సీఎస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా మని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఎస్డీ స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ములుగు రైతులు పాల్గొన్నారు.