Leaving Modi policies aside.. Look at Telangana: కేసీఆర్ కుటుంబం పదేపదే పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ అంటూ మాట్లాడుతుంది రెండు సంవత్సరాలు పొయ్యి అక్కడ ఉండండి తెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అనేక సార్లు ఓటేశారు.. రెండు సార్లు అధికారం కట్టబెట్టారు.. కానీ 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని మోడీ పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో మోడీ పట్ల అభిమానం పెరుగుతుంటే.. టీఆర్ఎస్ పార్టీ మోడీపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఊహ లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఇంట్లో ఈగల మోత…బయట పల్లకి మోతగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు అని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలను కలవరు కానీ.. పక్క రాష్ట్రాలకు విమానాలు వేసుకొని వెళ్లి అక్కడ నేతలను కలుస్తున్నారని విమర్శించారు. మోడీని తప్పు పట్టే విధానాలను పక్కన పెట్టండి.. ముందు తెలంగాణ సంగతి చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ, కల్యాణ లక్ష్మీ, ఎస్సీ, ఎస్టీ రుణాలు, పరిశ్రమలు ఇవ్వాల్సిన సబ్సిడీలు, మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేసే పరిస్థితి లేదన్నారు. సర్పంచ్ లు, ఎంపిటిసి లకు సకాలంలో బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
Read also: Tammineni Sitaram: క్యాన్సర్ పై మరింత అవగాహన అవసరం
గ్రామాల్లో వీధి లైట్లు, రోడ్లు వేస్తున్నారంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే అని గుర్తు చేశారు. రైతుల రుణాల మాఫీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది ధరణి సమస్యలపై ఫిర్యాదు చేస్తే… వాటిని పరిష్కరించలేదు అని విమర్శించారు. పాసు పుస్తకాలు ఇచ్చిన తర్వాత భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. అసైన్డ్ భూములు, శిఖం భూములు, పార్కులు, కేంద్ర ప్రభుత్వ భూములను టిఆర్ఎస్ పార్టీ నేతలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధరణి పరిస్థితి కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవ చేశారు. గులాబీ దండు గుండాయిజం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయ్.. చేతలు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ దాటడం లేదని ఎద్దేవ చేశారు. నిరుద్యోగ భృతి ఏమైంది? అని ప్రశ్నించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్స్ అందకుండా కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థుల పేర్లు, అకౌంట్ నెంబర్లు కేంద్రానికి ఇస్తే స్కాలర్ షిప్స్ అందుతాయని అన్నారు. విద్యావ్యవస్థ, గురుకులాల్లో కనీస వసతులు లేవని మండిపడ్డారు. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపై ధర్నా చేస్తున్నారు.
తెలంగాణలో అప్పులు తేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి అన్నారు. రేషన్ బియ్యం 90 శాతం కేంద్రమే ఇస్తుందని అన్నారు. పేదలకు కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా అందించలేదు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. ఆగస్టు నెలలో GST వసూళ్లు 1.6 లక్షల కోట్లకు పెరిగింది అని గుర్తు చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లపై గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి వస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కం లు దివాళా తీసే పరిస్థితి వస్తుందని తీవ్ర విమర్శలు చేసారు. విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఉత్పత్తి సంస్థల పరిరక్షణ కోసమే అన్నారు.
విద్యుత్ సంస్థలు దెబ్బ తింటే దేశం కుప్పకూలుతుందని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను మోసం చేశారు. దేశం నుంచి ఎక్స్ పోర్ట్స్ పెరిగాయని అన్నారు. వ్యాక్సిన్ ను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగం నుంచి 15 వేల కోట్ల ఎక్స్ పోర్ట్స్ పెరిగాయని అన్నారు. బిజేపీ చెప్పింది చేస్తుంది.. చేసేది చెబుతోంది. కేసీఆర్ తన కుటుంబం గురించి ఆలోచన చేస్తారు.. బీజేపీ ప్రభుత్వం మేకిన్ ఇండియా గురించి ఆలోచిస్తామన్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్పింది చేయరు.. చేయంది చెబుతారు. కేసీఆర్ తీరు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. డబ్బుల సంచులు పట్టుకొని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఆ కార్యాలయాల్లో అధికారులు ఈగలు కొట్టుకుంటున్నారని అన్నారు.
Minister RK Roja: రైతుల పేరుతో ఎందుకీ దొంగయాత్రలు బాబూ!