Leaders On Governor Tamilisai: గవర్నర్ పదవిపై పలువురు రాజకీయ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. గవర్నర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లలో మహిళా గవర్నర్‌ను వివక్షకు గురిచేశారన్నారు. ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైందని ఆమె ఆరోపించారు. గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదన్నారు. రాజ్‌భవన్‌లోని కార్యక్రమాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి ఫొటోలు ఉంచాలని.. ఫొటో లేకపోవడం వల్లే రాజ్‌భవన్‌కి రావడం లేదంటే రేపే రాజ్‌భవన్‌లో పెట్టిస్తామని అన్నారు.
సమ్మక్క సారక్క యాత్రకు వెళ్లినపుడు హెలికాప్టర్ అడిగితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్‌భవన్ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. రిపబ్లిక్ వేడుకలకూ ఆహ్వానించలేదు. శాసనసభలోనూ గవర్నర్ ప్రసంగాన్ని పక్కన పెట్టారు. సమస్యలు ఏమైనా చర్చించి పరిష్కరించుకోవాలి. గవర్నర్ ప్రతి అంశాన్నీ ఒప్పుకోవాలనో..అన్నింటినీ పక్కన పెట్టాలనో అనుకోకూడదు. రాజ్‌భవన్‌ను అవమానించారు. ఆయా అంశాలు తెలంగాణ చరిత్ర పేజీల్లో నిలిచిపోతాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష నేతలు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ పదవి ఓ నామినేటెడ్ పోస్ట్: గవర్నర్ పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవిని ఆయన ఓ నామినేటెడ్ పోస్ట్ అంటూ కామెంట్ చేశారు. గవర్నర్ పదవి కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువ అని జగ్గారెడ్డి అన్నారు. గవర్నర్ పదవి ఓ నామినేటెడ్ పోస్ట్ అన్న జగ్గారెడ్డి… ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడి పదవితో గవర్నర్ పదవి సమానమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే… ఆ పార్టీకి చెందిన వారే గవర్నర్లుగా వస్తారని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం టీఆర్ఎస్‌ది, గవర్నరేమో బీజేపీకి చెందిన వారు కావడంతోనే సమస్య వచ్చిందని అన్నారు.
రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరే: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని, ఆమెను తక్షణమే గవర్నర్ పదవి నుంచి రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌గా కొనసాగుతున్న తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని తాను గతంలోనే చెప్పానని అన్నారు. ఇప్పుడు కూడా తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం అన్ని వ్యవస్థలను కార్పొరేట్లకు ప్రత్యేకించి అదానీకి అప్పగిస్తోందని ఆయన ఆరోపించారు. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరేనని నారాయణ అన్నారు.
గవర్నర్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్..: గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గవర్నర్ తన పని తాను చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టమని ఆమె తెలిపారు. గవర్నర్ పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని వెళ్లారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌కు ఎవరూ రాకుంటే ఫోన్‌లు చేసి మరీ పిలిపించుకుంటున్నారని ఆమె అన్నారు. తెలంగాణ చరిత్ర గవర్నర్‌కు తెలియదని.. అందుకే విమోచనం అంటోందని మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందన్నారు. మీకు మీరే సమీక్ష చేసుకోండి.. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంటూ గవర్నర్‌కు సూచించారు.
Perni Nani: లోకేష్ కోసం ఐదుగురు మంత్రులను పీకేశారు.. బాంబ్ పేల్చిన పేర్నినాని..
అలా చేయడం సరికాదు: రాజ్యాంగబద్ధంగా పదవిలో వున్న గవర్నర్ ఆ వ్యవస్థను దిగజార్చే విధంగా వ్యవహరిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల మీటింగ్‌కు వెళ్లడం సీఎం కేసీఆర్ ఇష్టమని… మీకేమి బాధ్యత వుందన్నారు. గవర్నర్‌కు వున్న బాధ్యతల మేరకే పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వంపై ఏదో సాధించాలన్న ఆలోచనతో పని చేయడం సరికాదన్నారు. బీజేపీ పార్టీకి అనుబంధంగా రాజ్‌భవన్‌ను చేయాలని గవర్నర్ ప్రయత్నాలు చేస్తు్న్నారని ఆయన ఆరోపించారు. ఇది మంచిది కాదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని చేస్తున్న చర్యలు సరిగ్గా లేవన్నారు. రాజ్యాంగ పరంగా ఏమి నిర్వహించాలో అంత వరకే పరిమితం కావాలన్నారు. వాటికి విరుద్ధంగా యూనివర్సిటీ, హాస్పిటల్‌కు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.