అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అంటుంటారు. ఆ గ్రామంలో రైతులు కోటీశ్వరులు.. అక్కడ ఎకరం కోటికి పైగా ధర పలుకుతుంది. కొంచెం భూమి అమ్మితే డూప్లెక్స్ ఇళ్లు కట్టుకోవచ్చు.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగు పై ఆడ పిల్లల పెళ్ళి చేయవచ్చు. కానీ ఆ ఉళ్లో ఆడ బిడ్డలకు కళ్యాణ యోగం కలగడం లేదు. అన్నీ కుదిరినా పెళ్ళిళ్ళు మాత్రం వాయిదా వేస్తున్నారు. కట్నం ఇవ్వరని వరుడు తరపు బంధువులు పెళ్ళిళ్ళకు నో చెబుతున్నారు. కోట్లు పలికే భూములు ఉన్నా.. ఆ గ్రామ తల్లిదండ్రులు కూతుళ్ల వివాహాలను ఎందుకు వాయిదా వేస్తున్నారు.. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఆడపిల్లల పెళ్ళికి ఉన్న అడ్డంకులేంటి..? కొత్త ఇళ్ల నిర్మాణానికి ఉన్న అవాంతరాలేంటి?
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న.. బోర్గాం (కే) గ్రామస్దులు కోట్లు పలికే భూములు ఉన్నా.. కట్నం ఇచ్చేందుకు డబ్బుల్లేక భూముల రిజిస్ట్రేషన్ కు అవకాశం దొరక్క.. పెళ్ళిళ్ళు వాయిదా వేస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి వెనుకడుగేస్తున్నారు. కొడుకుల ఉన్నత చదువులు చదివించేందుకు ఆలోచిస్తున్నారు. బోర్గాం (కే) గ్రామ రైతులకు ఒక్కొక్కరికి ఐదు నుంచి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఎకరం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుంది. కొంచెం భూమి అమ్ముకున్నా.. కష్టాలు తొలగిపోతాయి. భూములు అమ్మి కూతుళ్ల పెళ్ళి, కొడుకుల ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు. డూప్లెక్స్ ఇళ్లు నిర్మించుకోవాలని కలలు ఉన్నారు. కానీ ఈ గ్రామస్ధులకు ధరణి రూపంలో ఊహించని షాక్ తగిలింది. సుమారు 200 మంది రైతులకు సంబంధించి 500 ఎకరాలకు పైగా భూమి నిషేధిత జాబితాలో చేరింది. ఫలితంగా భూముల అమ్మకాలు- కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు లబోదిబోమంటున్నారు. కోట్ల విలువ చేసే భూములు ఉన్నా.. కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. చేతిలో డబ్బుల్లేక వివాహాలు వాయిదా వేస్తున్నామని గ్రామస్ధులు చెబుతున్నారు.
బోర్గాం (కే) గ్రామ రైతులకు పట్టా భూములున్నాయి. ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు అందించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ధరణి అమల్లో వచ్చాక బోర్గాం కే రైతుల భూములన్ని నిషేధిత జాబితాలో చేరాయి. నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు, ఆలయ భూములు, నక్ప్ బోర్డు భూములు ఉంటాయి. కానీ బోర్గాం (కే) రైతుల భూములన్నీ నిషేధిత జాబితాలో చేరడం పట్ల రైతులు లబోదిబోమంటున్నారు. రైతుల భూములు సర్కారు భూములుగా రికార్డుల్లోకి చేరడంతో న్యాయం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రైతులు. నిజాం కాలం నుంచి రైతుల భూముల వివరాలు సేత్వార్ దస్త్రాల్లో లేకపోవడంతో ఇప్పుడు చిక్కులొచ్చాయి. సేత్వార్ అధారంగా ధరణి వెబ్ సైట్ లో వివరాలను అధికారులు పొందుపర్చడంతో..ఈ సమస్య ఉత్పన్నమైందని చెబుతున్నారు రైతులు. ఫలితంగా కోట్ల విలువ చేసే భూములు ఉన్నా.. అమ్మకాలు కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆవేదన చెందుతున్నారు. రియల్టర్లు కోనేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు రైతులు. భూములు అమ్మి పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటే.. భూములను కొనేందుకు ఎవరూ ముందుకు రాక వాయిదా వేస్తున్నామని అంటున్నారు.
బోర్గాం (కే) గ్రామ రైతుల భూముల నిషేధిత జాబితా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని నిజామబాద్ ఆర్డీఓ రవి చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నాం. సాంకేతిక సమస్యతో.. ధరణిలో ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కితే.. పట్టా భూమిగా మార్చేందుకు సర్కారుకు నివేదిక అందిస్తాం. త్వరలో సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కోట్ల విలువ చేసే భూములు ఉన్నా.. అవి అమ్మలేక, కొనలేక గ్రామస్ధులు పెళ్ళిళ్ళు వాయిదా వేస్తున్నారు. బోర్గాం కే గ్రామస్దుల పట్ల సర్కారు మానవతా దృక్పథంతో వ్యవహరించి, సమస్య పరిష్కరించాలని గ్రామస్దులు కోరుతున్నారు.
KTR: కేసీఆర్ లేకపోతే ఆ రెండు ఉండేవి కావు