కొన్ని రోజుల నుంచి తెలంగాణలో రాజకీయం అగ్గి రాజుకుంటోంది. తమ ఉనికి చాటేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు, సభలంటూ వరుసగా నిర్వహిస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలకి తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పర్యటించిన కేటీఆర్.. మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అసలు కేసీఆర్ లేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ప్రశ్నించారు. విమర్శలు చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా మాట్లాడారంటూ ఆయన గుర్తు చేశారు.
రైతులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందని విమర్శిస్తోందని, అసలు ఆ పార్టీ పాలిట ప్రాంతాల్లో రైతు బీమా ఉందా? అని మంత్రి నిలదీశారు. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ. 1,050 వరకూ పెరిగిందని.. ఈ విషయంపై మాత్రం బీజేపీ నేతలు నోరు మెదపరని ధ్వజమెత్తారు. రాజకీయ పర్యాటకులు వస్తారు, హైదరాబాద్‌లో బిర్యానీ తింటారు, ఆ తర్వాత వెళ్లిపోతారని సెటైర్స్ వేశారు. వారు తెలిసి, తెలియకుండా ఏవేవో మాట్లాడుతారని.. విపక్షాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. తాము చేసిందే చెప్తాం, చేసేది చెప్తాం, మరోసారి కేసీఆర్‌ను సీఎం చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాగా.. ఈ పర్యటనలో భాగంగా హవేలీలోని కైటెక్స్ టెక్స్‌టైల్ పార్కుకు భూమిపూజ, మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం గణేశ్ ఎకో పెట్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. పత్తి రైతులు బాగు పడాలనే సీఎం మెగా టైక్స్‌టైల్ పార్క్‌ని నెలకొల్పారన్నారు. గుజరాత్, తమిళనాడు కంటే నాణ్యమైన పత్తి ఇక్కడ పడుతుందని, రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయని భరోసా కల్పించారు. కరోనా వల్ల ఇక్కడికి కంపెనీలు రావడం ఆలస్యమయ్యాయని కేటీఆర్ తెలిపారు.