Komatireddy Venkat Reddy Talks About Priyanka Gandhi Meeting: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలన్న అంశంపై ఆమెతో చర్చించానని చెప్పారు. ఒక ఫంక్షన్ కారణంగా మొన్న నిర్వహించిన సమావేశానికి తాను హాజరు కాలేకపోయానని ఆమెకు వివరించానన్నారు. ఇప్పుడు తన కోసం ప్రత్యేకంగా సమయం ఇచ్చి, చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఈ చర్చలో భాగంగా తాను కొన్ని సలహాలు ఇచ్చానని, ఆమె కూడా టీమ్ వర్క్‌తో నేతలందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారన్నారు. ఏ సమస్య ఉన్నా, తన దగ్గరకు రమ్మని ప్రియాంకా గాంధీ చెప్పారన్నారు. ప్రస్తుతం తాను 10 రోజుల పాటు అందుబాటులో ఉండనని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోనే ఉంటానని ఆమె తెలిపారన్నారు. భారత్ జోడో యాత్ర సహా రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా ఈ భేటీలో అర్థవంతంగా చర్చ జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాగా.. ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశం తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చాక కాంగ్రెస్ పార్టీ తీరుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! 30 సంవత్సరాలుగా పార్టీలో పని చేస్తున్నప్పటికీ.. పార్టీ తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని సర్వనాశనం చేసి, పార్టీని నమ్ముకున్న తనలాంటి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. అలాగే.. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో ప్రియాంక నిర్వహించిన భేటీకి కూడా డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ప్రియాంకా గాంధీ భేటీ అనంతరం ఆ అనుమానాలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. మొన్న సమావేశానికి డుమ్మా కొట్టడంతో, స్వయంగా ప్రియాంకా గాంధీనే తనతో భేటీకి రావాలంటూ కబురు పంపారు.